కొత్త ఆయుధంతో అమెరికాకు ముచ్చెమటలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
ముఖ్యంగా ‘కొత్త ఆయుధంతో అమెరికాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాం’ అన్న హెచ్చరిక అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
By: Tupaki Political Desk | 30 April 2026 11:10 AM ISTపశ్చిమాసియాలో ముదురుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి సవాలుగా మారుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ షారమ్ ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇరానీయులు అమెరికాపై ఎంతటి ప్రతీకార వాంఛతో ఉన్నారో అర్థం అవుతోంది. ముఖ్యంగా ‘కొత్త ఆయుధంతో అమెరికాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాం’ అన్న హెచ్చరిక అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం యుధాల ప్రయోగానికి దారితీస్తోంది. ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ తాజా ప్రకటనలు అగ్రరాజ్యంను హెచ్చరిస్తున్నాయి. శత్రువుకు అత్యంత చేరువలోనే తమ కొత్త ఆయుధం ఉందని, అది ప్రయోగిస్తే వారికి గుండెపోటు ఖాయమని వ్యాఖ్యానించారు. ఆ ఆయుధం ఏమిటనేది రహస్యంగా ఉంచినప్పటికీ, అది అమెరికా విమాన వాహక నౌకలను లక్ష్యం చేసుకోగల శక్తివంతమైనది కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హర్మూజ్ దిగ్బంధనం
హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా చర్చలకు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం ఓడరేవులను దిగ్బంధించింది. సైనిక చర్య కంటే ఈ దిగ్బంధనమే ఇరాన్‌ను ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్ తెరుస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. అయితే, అణు ఒప్పందం కుదిరే వరకు ఈ ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
యుద్ధ రంగంలో తాజా పరిణామాలు
ఇరాన్ నేవీ కమాండర్ వెల్లడించిన ప్రకారం.., ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. అమెరికాకు చెందిన శక్తివంతమైన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్‌పై ఇరాన్ దళాలు ఏడు క్షిపణులతో దాడి చేశాయని, దీనివల్ల ఆ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ఇరానీ పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని, శత్రువు పశ్చాత్తాపం చెందే వరకు దెబ్బ కొడుతూనే ఉంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది.
రాజీ లేని పోరాటం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, అందుకే వారు చర్చల కోసం సుముఖత వ్యక్తం చేస్తున్నారని విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుందని, అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేసే వరకు ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణ కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు. హర్మూజ్ జలసంధి మూతపడితే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇరాన్ తన ‘కొత్త ఆయుధాన్ని’ నిజంగానే ప్రయోగిస్తే.., అది పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, మానవాళి మరో భారీ వినాశనాన్ని చూడాల్సి వస్తుంది.
