విదేశాల్లోని ఇరానీయులకు షాకిచ్చే వార్నింగ్
విదేశాల్లోని ఇరానీయులకు ఇరాన్ ప్రభుత్వం తాజాగా షాకింగ్ వార్నింగ్ ఇచ్చింది.
By: Garuda Media | 9 March 2026 8:07 PM ISTవిదేశాల్లోని ఇరానీయులకు ఇరాన్ ప్రభుత్వం తాజాగా షాకింగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి.. విదేశాల్లో ఉన్న ఇరానీయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటమే కాదు.. అలా చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని తేల్చేసింది. అలాంటి వారికి సంబంధించి ఇరాన్ లో ఉన్న ఆస్తుల్ని జఫ్తు చేస్తామని తేల్చి చెప్పింది.
విదేశాల్లో ఉండే ఇరానీయులు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసినా.. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా అలాంటి వారి విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన సారాంశాన్ని ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలో పని చేసే ఐఆర్ఐబీ వార్తా సంస్థ దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది.
విదేశాల్లో ఉంటూ సొంత దేశానికి శత్రువులగా పని చేసే వారి ఆస్తుల్ని ప్రభుత్వం జఫ్తు చేస్తుందని.. అలా ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని తెలిపింది. అంతేకాదు.. విదేశాల్లో ఉంటూ ఇజ్రాయెల్.. అమెరికా ప్రభుత్వా కోసం ఏదైనా ఇంటెలిజెన్స్ లేదంటే ఆ తరహా కార్యకలాపాలకు పాల్పడితే.. ఆయా పౌరుల ఆస్తుల స్వాధీనం మాత్రమే కాదు.. మరణ దండన కూడా విధించొచ్చన్న విషయాన్ని వెల్లడించింది. మరి.. ఈ తాజా హెచ్చరికపై ఇజ్రాయెల్.. అమెరికా ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.
