ఇంటికో సైనికుడు కాదు.. దేశమంతా సైన్యమే!
ప్రస్తుత సమయంలో యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రత్యామ్నాయం లేదా? అంటే.. లేదనే సమాధానం వినిపిస్తోంది.
By: Garuda Media | 19 May 2026 6:00 PM ISTఅమెరికాతో జరుగుతున్న యుద్ధంలో కాస్త విరామం లభించినప్పటికీ.. ఈ యుద్ధం కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తన్న ఇరాన్.. తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఈ విరామాన్ని అమెరికా.. సర్వశక్తులు కూడగట్టుకునేందుకు ఉపయోగించుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా విషయంలో నాటో దేశాలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలను కూడా ఒప్పిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో అలెర్ట్ అయిన.. ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్.. మరోసారి విరుచుకుపడితే.. అది మామూలు గా ఉండదని.. ఇరాన్‌ను సర్వనాశనం చేసే దిశగా రెండు దేశాలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాయని అంచనా వేసింది.ఈ క్రమంలోనే ఇరాన్.. తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలకు యుద్ధ విద్యలో శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు దీనిలో పాల్గొనాలని టెహ్రాన్ ఆదేశించింది.
కానీ.. ఇప్పుడు అలా కాకుండా.. యువకుల నుంచి వృధ్ధుల వరకు.. మహిళల నుంచి పురుషల దాకా.. అందరికీ యుద్ధ విద్యలో శిక్షణ ఇస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తుపాకీ వినియోగంలో నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ఇదేసమయంలో వృద్ధులను, చిన్న పిల్లలను రక్షించుకునే విధానాలను నేర్పుతున్నా రు. ఇంటికొకరు కాకుండా.. ఇంటిల్లిపాదీ యుద్ధంలో పాల్గొనేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తద్వారా అమెరికా, ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఏ విధంగా ఉన్నా..ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు.
ప్రత్యామ్నాయం లేదా?
ప్రస్తుత సమయంలో యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రత్యామ్నాయం లేదా? అంటే.. లేదనే సమాధానం వినిపిస్తోంది. ఇరు పక్షాలు కూడా వెనక్కి తగ్గకపోవడం.. రెండు దఫాలుగా పాకిస్థాన్ వేదికగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో యుద్ధానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే సంకేతాలు రావడం లేదు. అయినప్పటికీ.. పాకిస్థాన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, పాక్‌పై అమెరికా, ఇరాన్‌లు ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఎటూ తెగేసి చెప్పలేని పరిస్థితి దాయాది దేశానికి ఎదురైంది.
