ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్‌కు అమెరికన్ల షాక్
తాజాగా వెలువడిన ఫాక్స్ న్యూస్ పోల్ సర్వే ఫలితాలు అమెరికా ప్రజాభిప్రాయంలో వస్తున్న పెను మార్పులకు అద్దం పడుతున్నాయి.
By: A.N.Kumar | 28 March 2026 2:00 PM ISTఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న "యుద్ధోన్మాద వైఖరి" ఇప్పుడు ఆయనకే పెద్ద సవాలుగా మారుతోంది. తాజాగా వెలువడిన ఫాక్స్ న్యూస్ పోల్ సర్వే ఫలితాలు అమెరికా ప్రజాభిప్రాయంలో వస్తున్న పెను మార్పులకు అద్దం పడుతున్నాయి.
ట్రంప్ విధానాలపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి
అమెరికా రక్షణ, విదేశాంగ విధానాల్లో ట్రంప్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు సామాన్య ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వే గణాంకాలను పరిశీలిస్తే .. దాదాపు 59 శాతం మంది ఓటర్లు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇందులో 47 శాతం మంది అత్యంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. కేవలం 41 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా విదేశాంగ విధానాల విషయంలో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 62 శాతం మంది ఆయన విదేశాంగ నిర్ణయాలను తప్పుబట్టగా ఇరాన్ వ్యవహారంలో ఆయన తీరును 64 శాతం మంది తీవ్రంగా విమర్శించారు. అమెరికాను మరో యుద్ధంలోకి నెట్టడం ఇష్టం లేని మెజారిటీ ప్రజలు.. దౌత్యపరమైన పరిష్కారాల కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నారు.
యుద్ధ భయం.. ప్రజల ఆందోళన
ఇరాన్ సైనిక కమాండర్ల లక్ష్యంగా జరిగిన దాడులు.. ప్రతిగా ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టాయి. ఈ పరిణామాలు అమెరికాలోని యువత, మధ్యతరగతి వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు.. మరోసారి అటువంటి పరిస్థితి రాకూడదని బలంగా కోరుకుంటున్నారు.
శాంతిని కాంక్షించే వారు.. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. ట్రంప్ తీసుకుంటున్న "కఠిన వైఖరి" అమెరికాను అంతర్జాతీయ వేదికపై ఏకాకిని చేసే ప్రమాదం ఉంది. మిత్రదేశాల మద్దతు లేకుండా కేవలం శక్తి ప్రదర్శనతో ముందుకు వెళ్లడం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని 60 శాతానికి పైగా ప్రజలు భావిస్తున్నారు.
చీలిపోయిన అమెరికా సమాజం
ట్రంప్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ఒకవైపు ఉంటే ఆయన అనుచర వర్గం మాత్రం ఈ నిర్ణయాలను సమర్థిస్తోంది. "అమెరికా ఫస్ట్" నినాదంతో ఇరాన్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచడం దేశ గౌరవానికి చిహ్నమని వారు వాదిస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా బలహీనంగా కనిపిస్తుందని రిపబ్లికన్ మద్దతుదారులు భావిస్తున్నారు. దీనివల్ల అమెరికా సమాజం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. "యుద్ధం వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును కాదని తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని కుండబద్దలు కొడుతున్నారు.
రాబోయే ఎన్నికలపై ప్రభావం
ప్రస్తుత సర్వే ఫలితాలు రాబోయే ఎన్నికల దృష్ట్యా ట్రంప్‌కు ఒక హెచ్చరికగా మారాయి. ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పటికీ విదేశాంగ వైఫల్యాలు.. యుద్ధ మేఘాలు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవచ్చు. ఇరాన్ అంశంపై ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే అది ప్రతిపక్ష డెమొక్రాట్లకు పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది.
మొత్తంగా ఇరాన్-అమెరికా వివాదం ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా వైట్ హౌస్ గెలుపోటములను నిర్ణయించే స్థాయికి చేరుకుంది. అమెరికా ప్రజలు యుద్ధానికి బదులుగా శాంతిని.. ఘర్షణకు బదులుగా చర్చలను కోరుకుంటున్నారనేది ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.
