Begin typing your search above and press return to search.

యుద్ధంతో భారత్ కు నష్టం.. ఆ దేశాలకు లాభాల పంట!

ముఖ్యంగా భారత్‌, యూరోపియన్ యూనియన్‌, యూకే, జపాన్‌, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ సంక్షోభానికి ప్రధాన బాధితులుగా మారాయి.

By:  A.N.Kumar   |   30 March 2026 12:11 PM IST
యుద్ధంతో భారత్ కు  నష్టం.. ఆ దేశాలకు లాభాల పంట!
X

ఇరాన్‌–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం సైనిక పరిమితుల్లోనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా చేపట్టిన చర్యలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత భయాలు గ్లోబల్ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్రూడ్‌ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతుండటంతో ఆయిల్ దిగుమతులపై ఆధారపడిన దేశాలు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత్‌, యూరోపియన్ యూనియన్‌, యూకే, జపాన్‌, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ సంక్షోభానికి ప్రధాన బాధితులుగా మారాయి.

భారత్‌పై ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. దేశం తన ఇంధన అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటం వల్ల క్రూడ్ ధరల పెరుగుదల నేరుగా ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతోంది. ప్రతి బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే దేశానికి 12 నుంచి 18 బిలియన్ డాలర్ల అదనపు భారంగా మారుతోంది. ఇప్పటికే నెలరోజుల్లోనే దిగుమతి బిల్లు 42 బిలియన్ డాలర్ల వరకు పెరిగినట్లు అంచనా. రూపాయి విలువ కూడా భారీగా పడిపోయి డాలర్ ముందు బలహీనపడుతోంది. దీంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, దిగుమతి ఖర్చులు పెరగడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

ఇంధన ధరల పెరుగుదల దేశీయ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. జీడీపీ వృద్ధి రేటు సుమారు 0.5 శాతం తగ్గే అవకాశముండగా.. ద్రవ్యోల్బణం 30 నుంచి 40 బేస్ పాయింట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆటోమొబైల్‌, ఏవియేషన్‌, పెయింట్స్ వంటి రంగాలు ఎక్కువగా ఇంధనంపై ఆధారపడటం వల్ల ఈ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఇక ఈ సంక్షోభం వల్ల కొన్ని దేశాలు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా ఈ పరిస్థితిని పూర్తిగా వినియోగించుకుంటోంది. భారత్‌కు రష్యన్ చమురు అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఒక్క నెలలోనే సుమారు 5 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం పొందింది. అమెరికా, కెనడా, నార్వే వంటి దేశాలు కూడా ఇంధన ఎగుమతుల ద్వారా నెలకు 3 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు అదనపు లాభాలు ఆర్జిస్తున్నాయి. చైనా కూడా రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేస్తూ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

ఆశ్చర్యకరంగా యుద్ధంలో నేరుగా ఉన్న ఇరాన్ కూడా లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటడంతో ఇరాన్ తన చమురును తక్కువ డిస్కౌంట్‌తో విక్రయిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. రోజువారీ ఆదాయం రెట్టింపు అయ్యిందని అంచనాలు సూచిస్తున్నాయి.

ఇక యూరోపియన్ దేశాలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. జర్మనీ, ఇటలీ వంటి పారిశ్రామిక దేశాల్లో ఇంధన వ్యయం 30 శాతం వరకు పెరిగింది. జపాన్‌, సౌత్ కొరియా వంటి దేశాలు దాదాపు పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం వల్ల వారి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. యూకేలో కూడా బ్రెక్సిట్ తర్వాత ఇంధన భద్రత సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి.

మొత్తంగా చూస్తే ఇరాన్–అమెరికా యుద్ధం ఒక ఆర్థిక యుద్ధంగా మారింది. ఈ సంక్షోభాన్ని సృష్టించిన దేశాలు, ఇంధన ఎగుమతిదారులు లాభపడుతుండగా.. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీ నష్టాలను మోస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్‌లో శాశ్వత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.