'దౌత్యానికి నో ఛాన్స్'... ఇరాన్ డబ్ల్యూడబ్ల్యూ-3 కన్ఫాం చేసినట్లేనా?
ఈ నేపథ్యంలో ఇలాంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అమెరికాతో ఐక్యరాజ్యసమితి లోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అబ్బాస్.
By: Tupaki Desk | 22 Jun 2025 11:24 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో శనివారం అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ లోని అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసింది. దీన్ని ఇరాన్ సీరియస్ గా పరిగణించింది. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్స్ అరఘ్చి.. అమెరికాతో దౌత్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అవును... తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని సయ్యద్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దౌత్యంపై స్పందించారు.
ఇందులో భాగంగా... దౌత్యం అనే దానికి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన సయ్యద్ అబ్బాస్... ఇప్పటికైతే మాత్రం దానికి అవకాశం లేదని.. అమెరికా మాత్రం అణు కేంద్రాలపై దాడి చేసి చాలా పెద్ద రెడ్ లైన్ ను దాటిందని అన్నారు. తమ ఆత్మరక్షణ హక్కు ఆధారంగా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో... తమ దేశంలోని మూడు అణు కేంద్రాలపై దాడికి యుద్ధోన్మాదంలో ఉన్న అమెరికా.. తదనంతర పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని సయ్యద్ అబ్బాస్ హెచ్చరించారు. ఇరాన్ అణు కేంద్రలపై అమెరికా సైనిక దుశ్చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోందని చెబుతూ.. ఐక్యరాజ్యసమితి చట్టాలను వాషింగ్టన్ తుంగలో తొక్కిందన్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అమెరికాతో ఐక్యరాజ్యసమితి లోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అబ్బాస్.. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. మరోవైపు.. టెల్ అవీవ్ పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
ఇలా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా తో దౌత్యానికి అవకాశం లేదని ఇరాన్ చెప్పడంతో.. తదుపరి పరిణామాలు ఏమిటనేది ఆసక్తిగా మారింది. దీంతో.. ఇరాన్ మాటలు వరల్డ్ వార్ - 3 సందేహాలను, ఆందోళనలకు బలం చేకూర్చేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా... పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ శాంతి, భద్రతలను త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం దౌత్యం కోసం పిలుపును పునరుద్ఘాటించామని అన్నారు.
