ఇరాన్ వద్ద 400 కేజీల యురేనియం... ట్రంప్ నమ్మకం ఏమిటంటే..?
పశ్చిమాసియాలో భీకరంగా జరుగిన ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jun 2025 5:00 PM ISTపశ్చిమాసియాలో భీకరంగా జరుగిన ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు పెద్దఎత్తున దాడులు చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంను ముందుగానే అక్కడినుంచి తరలించినట్లు వస్తోన్న కథనాలు వైరల్ గా మారాయి.
అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ లు అణుకేంద్రాలపై దాడులు చేసినప్పుడు ఎలాంటి ప్రమాదకర వాయువులు విడుదల కాలేదని అంటున్నారు. దీంతో.. ఆ అణుకేంద్రాల్లోని యురేనియం నాశనం అవ్వలేదా అనే చర్చా తెరపైకి వచ్చింది. మరోవైపు యురేనియంను ముందుగానే తరలించినట్లు టెహ్రాన్ చెబుతోందని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ స్పందించారు.
అవును.. ఇరాన్ లోని అణుకేంద్రాల్లో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అణుకేంద్రాలపై దాడికి ముందే ఇరాన్ దాన్ని తరలించేసిందని చెబుతున్నారు. ఆ రహస్య స్థావరంపై తమకు సమాచారం ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది. జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు.
ఇందులో భాగంగా... ఆ ప్రాంతంలో ఉన్న కార్లు, చిన్నపాటి ట్రక్కులు అక్కడి పరికరాలను కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తున్న కార్మికులవి మాత్రమే అని.. ఆ 400 కిలోల యురేనియంను అక్కడినుంచి తీసుకెళ్లలేదని.. అంత మొత్తాన్ని తరలించడం చాలా కష్టమని.. అందుకు చాలా సమయం పడుతుందని.. అంతేకాకుండా.. అది చాలా ప్రమాదకరం కూడా అని ట్రంప్ 'ట్రూత్' లో రాసుకొచ్చారు.
ఇదే సమయంలో... ఈ విషయంపై స్పందించిన అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్.. అవి అక్కడే ఉన్నాయా, వేరే చోటుకి తరలించారా అనే దానిపై తనకు కచ్చితమైన నిఘా సమాచారం లేదని అన్నారు.
కాగా... ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉందని.. దాన్ని కొన్నిరకాల ఆయుధాల్లో వాడి ఉండొచ్చని... దీనిని చిన్న కంటైనర్లలో, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు తెలిపారు. దీంతో.. పది బాంబులను తయారూ చేయొచ్చని వెల్లడించారు.
