Begin typing your search above and press return to search.

'రెస్పెక్ట్ కావాలి'... డీల్ కుదరాలంటే ట్రంప్ కు ఇరాన్ కండిషన్!

అవును.. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్‌ ఖండించింది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 9:23 AM IST
రెస్పెక్ట్ కావాలి... డీల్ కుదరాలంటే ట్రంప్ కు ఇరాన్ కండిషన్!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ముగిసిన అనంతరం అణుఒప్పందం ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ఆపినందుకు, తన ప్రాణాలు రక్షించినందుకు ఖమేనీ తనకు కృతజ్ఞతలు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో... ఇరాన్ స్పందించింది. రెస్పెక్ట్ లేకపోతే డీల్ కుదరదంటూ స్పష్టం చేసింది.

అవును.. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్‌ ఖండించింది. తమతో నిజంగా అణు ఒప్పందం కావాలనుకుంటే ఖమేనీని మర్యాదగా సంబోధించాలని ట్రంప్‌ కు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు. లక్షలాది మంది ఖమేనీ అభిమానుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ సూచించారు.

అసలేం జరిగిందంటే... ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఖమేనీ హత్యకు గురికాకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడని ట్రంప్‌ ఓ పోస్టు పెట్టారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో తనకు కచ్చితంగా తెలుసని.. ప్రపంచంలో అత్యంతశక్తిమంతమైన అమెరికా, ఇజ్రాయెల్‌ దళాల చేతుల్లో ఆయన జీవితాన్ని ముగించనివ్వలేదని అన్నారు.

ఇదే సమయంలో... తాను అతనిని అతి ఘోరమైన చావు నుంచి రక్షించానని.. అయినా, నాకు ఖమేనీ ధన్యవాదాలు తెలపలేదని ట్రంప్‌ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఈసందర్భంగా ఇరాన్‌ పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు. ఈ వ్యాఖ్యలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ.. ఖమేనీని అగౌరవంగా సంబోధించడాన్ని ఖండించారు. ట్రంప్‌ నిజంగా తమతో ఒప్పందం జరగాలని భావిస్తుంటే తమ సుప్రీం లీడర్‌ ను మర్యాదగా సంబోధించాలని సూచించారు. లక్షలమంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయోద్దంటూ 'ఎక్స్‌'లో పోస్టు పెట్టారు.

అక్కడితో ఆగని ఆయన... ఇరాన్‌ ప్రజలు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపారని.. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ కు మరో దారి లేక ట్రంప్‌ వద్దకు పరుగెత్తుకెళ్లిందన్నారు. కాగా.. అంతకుముందు... ఖతార్ లోని ఎయిర్ బేస్ పై తాము చేసిన దాడులకు భయపడిన అమెరికా, సీజ్ ఫైర్ కోసం ఇజ్రాయెల్ ను బలవంతంగా ఒప్పించిందని చెప్పిన సంగతి తెలిసిందే.