చైనాను ప్రోత్సహిస్తామంటున్న అమెరికా.. మెలిక ఏమిటంటే..?
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా మరింత ఉదృతంగా మారిపోయాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 9:59 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా మరింత ఉదృతంగా మారిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధం అమెరికా ఎంట్రీకి ముందు ఒకలెక్క అగ్రరాజ్యం ఎంట్రీ తర్వాత మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిందని అంటున్నారు. ఈ సమయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హార్మూజ్ జలసంధిని మూసివేయనుంది!
అవును... ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ పై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. దీనిపై ఇరాన్ సీరియస్ గా ఉంది. ఈ సందర్భంగా స్పందించిన ఐ.ఆర్.జీ.సీ. నేవీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలిరేజా టాంగ్సిరి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇందులో భాగంగా.. "హార్ముజ్ జలసంధి కొన్ని గంటల్లోనే మూసివేయబడుతుంది" హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రకటన అనంతరం ఇరాన్ పార్లమెంట్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు ఆ చట్టసభ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరి వెల్లడించారు. తుది నిర్ణయం సుప్రీం నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్ తీసుకోవాల్సి ఉంది!
అరేబియా సముద్రంలో ఒమన్ కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. మరోవైపు ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్ లో 80% చైనా కొనుగోలు చేస్తుంది.. అది ఈ మార్గం ద్వారానే టెహ్రాన్ నుంచి బీజింగ్ కు వెళ్తుంది! ఎల్.ఎన్.జీ ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే... ఆ ప్రభావం మిగిలిన దేశాలకంటే ఎక్కువగా చైనా పైనే పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... చైనాను ఈ విషయంలో ప్రోత్సహిస్తామంటుంది అమెరికా. తాజాగా ఈ విషయంపై స్పందించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆదివారం చైనాకు ఈ మేరకు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా... చైనా ప్రభుత్వం ఆ విషయం గురించి ఇరాన్ కు ఫోన్ చేయాలని తాము ప్రోత్సహిస్తున్నామని.. ఎందుకంటే చైనా తమ చమురు కోసం హార్ముజ్ జలసంధిపై ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. ఇదే సమయంలో.. మిగతా దేశాలు ఈ విషయంపై స్పందించాలని.. మాకంటే వారికే ఎక్కువగా నష్టం కలుగుతుందని రూబియో అన్నారు.
ఇదే సమయంలో.. ఇరాన్ అలా చేస్తే, అది మరొక భయంకరమైన తప్పు అవుతుందని చెప్పిన రూబియో... ఆ నిర్ణయం అమలు చేస్తే అది వారికి ఎకనామిక్ సూసైడ్ లాంటిదని తెలిపారు. పైగా ఈ నిర్ణయం వల్ల అమెరికా కంటే మిగిలిన ప్రపంచ దేశాలకు ఆర్థికంగా ఎక్కువ నష్టమని రూబియో చెప్పుకొచ్చారు.
