Begin typing your search above and press return to search.

80ల ’ట్యాంకర్‌ వార్‌‘ మళ్లీనా?.. అమెరికా ఎస్కార్ట్‌పై సందేహాలు

ప్రస్తుత పరిస్థితులు 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయాన్ని గుర్తుకు తెస్తున్నాయి.

By:  A.N.Kumar   |   27 April 2026 1:00 AM IST
80ల ’ట్యాంకర్‌ వార్‌‘ మళ్లీనా?.. అమెరికా ఎస్కార్ట్‌పై సందేహాలు
X

హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్నిగుండంగా మారుతోంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో సింహభాగం సరఫరా అయ్యే ఈ కీలక జలమార్గంలో ఇరాన్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను.. ముఖ్యంగా అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ముప్పుగా పరిణమిస్తున్నాయి.

చారిత్రక నేపథ్యం: 1980ల 'ట్యాంకర్ వార్' పునరావృతమా?

ప్రస్తుత పరిస్థితులు 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయాన్ని గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో "ట్యాంకర్ వార్" పేరుతో ఇరు దేశాలు చమురు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ సమయంలో ఇరాన్ సముద్రంలో మైన్లను అమర్చి అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగించింది. దీనిని అడ్డుకోవడానికి అమెరికా 'ఆపరేషన్ ఎర్నెస్ట్ విల్' చేపట్టింది. కువైట్ చమురు ట్యాంకర్లపై అమెరికా జెండాను ఎగురవేసి, తన యుద్ధనౌకల రక్షణలో వాటిని గమ్యస్థానాలకు చేర్చింది.

అయితే ఆ ప్రయాణం రక్తసిక్తమైంది. యూఎస్‌ఎస్ స్టార్క్‌పై జరిగిన దాడిలో అమెరికన్ నావికులు మరణించగా పొరపాటున ఇరాన్ పౌర విమానాన్ని అమెరికా కూల్చివేయడంతో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తూనే ఉన్నాయి.

ఇరాన్ 'స్వార్మ్ టాక్టిక్స్'.. చిన్న పడవలే పెద్ద ముప్పు

అప్పటికి ఇప్పటికి ఇరాన్ తన యుద్ధ తంత్రాలను పూర్తిగా మార్చేసింది. భారీ యుద్ధనౌకల కంటే వేగంగా ప్రయాణించే చిన్న చిన్న స్పీడ్‌బోట్లను ఇరాన్ ఆయుధంగా వాడుతోంది. పదుల సంఖ్యలో చిన్న బోట్లు ఒక్కసారిగా పెద్ద నౌకలను ముట్టడించడం ద్వారా వాటిని నిరుపయోగం చేయడం... ఈ బోట్లలో అత్యాధునిక మెషీన్ గన్లు, రాకెట్ లాంచర్లు, క్షిపణులు అమర్చబడి ఉంటాయి. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను జోడించడం ద్వారా ఇరాన్ తన సముద్ర గెరిల్లా పోరాట పటిమను పెంచుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఇరాన్ పడవలు మన నౌకలను వేధిస్తే వాటిని కాల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడం ఈ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుత తరుణంలో అమెరికాకు మద్దతుగా నిలిచేందుకు యూరప్ దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని.. తద్వారా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని ప్రపంచ మార్కెట్లు భయపడుతున్నాయి.

పరిష్కార మార్గాలు ఏవి?

ప్రస్తుతం ప్రపంచం ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించడం.. అయితే ఇరు దేశాల మధ్య పెరిగిన అపనమ్మకం వల్ల ఇది కష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ సముద్ర సామర్థ్యాలను దెబ్బతీయడం... ఇది జరిగితే పశ్చిమాసియా మొత్తం యుద్ధ మేఘాల్లో చిక్కుకుంటుంది.

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కేవలం సముద్ర జలాలకే పరిమితం కావు. ఇది ప్రపంచ ఇంధన భద్రతకు సంబంధించిన అంశం. అగ్రరాజ్యం అమెరికా తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు అత్యంత కీలకం. గత చరిత్రలోని పాఠాలను గుర్తుంచుకుంటూనే.. ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించకపోతే.. హర్మూజ్ సంక్షోభం గ్లోబల్ ఎకానమీని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది.