'ఖమేనీ ఎక్కడ'?... ముక్తసరి సమాధానాలకు అర్ధం ఏమిటి?
ఇక సుమారు రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 1:11 PM ISTఇరాన్ లో మోస్ట్ పవర్ ఫుల్ ఎవరంటే... ఠక్కున చెప్పే పేరు "అయుతుల్లా అలీ ఖమేనీ" అని! ఇరాన్ సుప్రీం లీడర్ గా ఏకచత్రాధిపత్యం వహిస్తోన్న ఖమేనీ... ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసినప్పటికీ బయట ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో తెరపైకి షాకింగ్ ప్రశ్నలు రాగా, వాటికి ముక్తసరి సమాధానాలు వస్తుండటం గమనార్హం.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న సమయంలో "ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగిసినట్లు!" అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఖమేనీ ఎక్కడున్నారో తెలిసినా, తాము ఇప్పుడే చంపమని ట్రంప్ నుంచి షాకింగ్ స్టేట్ మెంట్! అయినా ట్రంప్ మాటమీద నిలబడే వ్యక్తికాదు కదా అనేది మరో సందేహం!
ఇక సుమారు రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా విజయం మాదమంటే మాదని ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి! అయితే.. విజయం తన దౌత్యానిది, మద్యవర్తిత్వానిది అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితి!
ఇంత జరుగుతున్నా ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పటివరకూ బయట ప్రపంచానికి కనిపించలేదు. ఇజ్రాయెల్ దాడులకు భయపడి రహస్యంగా, సిగ్నల్ కూడా రాని బంకర్ లో దాక్కొన్న ఖమేనీ... ఇంకా బయటకు రాలేదు. ఈపాటికి బయటకు వచ్చి, తమ దాడులకు అమెరికా భయపడిందనే వ్యాఖ్యలు చేస్తారని చాలా మంది భావించినా.. ఆయన బయట ముఖం చూడటం లేదు.
ఈ నేపథ్యంలో.. ఇరాన్ ప్రభుత్వ రంగ టీవీలో జరిగిన కార్యక్రమంలో యాంకర్ ఖమేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ అధిపతి మెహదీ ఫజైలీని ఈ విషయంపై ప్రశ్నించారు. ఇందులో భాగంగా.. "సుప్రీం లీడర్ ఖమేనీ గురించి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మీరు మాకు చెప్పగలరా..?" అని అడిగారు.
దీనికి సమాధానంగా స్పందించిన మొహదీ... తనను ఇలా చాలా మంది ఇదే ప్రశ్న అడిగారని.. చాలామంది ఆందోళన చెందుతున్నారని.. అయితే, మనం అందరం ఆయన కోసం ప్రార్థనలు చేద్దామని అన్నారు. ఇదే సమయంలో.. సుప్రీం నేత రక్షణగా ఉన్నవారు తమ విధులు నిర్వహిస్తున్నారు.. ప్రజలు ఆయనతో కలిసి విజయోత్సవాలు జరుపుకొంటారని చెప్పుకొచ్చారు.
ఈ ముక్తసరి సమాధానంతో తెరపైకి మరిన్ని సందేహాలు వస్తున్నాయని అంటున్నారు. యుద్ధ సమయంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా బంకర్ లో ఉన్నట్లు అధికారికంగా చెప్పిన నేపథ్యలో.. ఇప్పుడు కాల్పుల విరమణ అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంపై పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి!
అయితే... కాల్పుల విరమణ తర్వాత కూడా ఖమేనీని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా యత్నిస్తోందని.. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ మరింత కఠినం చేసినట్లు ఐ.ఆర్.జీ.సీ కమాండర్ జనరల్ యాహ్య సఫావీ కుమారుడు, పొలిటికల్ ఎనలిస్ట్ హమ్జా సఫావీ తెలిపారు. చాలా తక్కువమందిని ఆయన కలుస్తున్నట్లు తెలిపారు.
