Begin typing your search above and press return to search.

ఇరాన్ ప్రతీకార దాడులు.. ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం

తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు తెర తీయటం తెలిసిందే. చెప్పా పెట్టకుండా దాడులకు తెర తీయకుండా.. ముందస్తుగా సమాచారం ఇచ్చి మరీ.. పొరుగన ఉన్న ఖతార్.. ఇరాక్ లపై దాడులు చేపట్టింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:56 AM IST
ఇరాన్ ప్రతీకార దాడులు.. ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం
X

తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు తెర తీయటం తెలిసిందే. చెప్పా పెట్టకుండా దాడులకు తెర తీయకుండా.. ముందస్తుగా సమాచారం ఇచ్చి మరీ.. పొరుగన ఉన్న ఖతార్.. ఇరాక్ లపై దాడులు చేపట్టింది. ఎందుకంటే.. ఈ రెండు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేయనున్నట్లుగా చెప్పి దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా 12 బాంబుల్ని వేసినట్లుగా పేర్కొంటూ.. అమెరికా తమపై ప్రయోగించిన బాంబులకు తగ్గట్లే తాము అన్నే బాంబులు వేశామని చెప్పింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇరాన్ ప్రతీకార దాడులకు తెర తీసిన వేళ.. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్లే తమకు చెందిన అన్ని విమాన సర్వీసుల్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. పశ్చిమాసియాలోని దేశాలు.. ఉత్తర అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న పలు నగరాలు.. యూరోప్ నకు విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది.

ఉత్తర అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన కొన్ని విమానాల్ని మళ్లీ వెనక్కి మళ్లించినట్లుగా పేర్కొన్న ఎయిరిండియా.. భారత్ నుంచి బయలుదేరిన వాటిని ఇతర మార్గాల్లో వెనక్కి రప్పిస్తున్నట్లుగా వెల్లడించింది. పరిస్థితిని గమనిస్తున్నామని.. తమ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నట్లుగా తెలిపింది. తమ ప్రయాణికుల భద్రతే తమకు తొలి ప్రాధాన్యతగా పేర్కొంది. ఎయిరిండియా మాత్రమే కాదు గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రయాణించే పలు విమానయాన సంస్థలు కూడా తమ విమాన సర్వీసుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

బయలుదేరిన విమానాల్ని ఇతర మార్గాల్లోకి మళ్లించారు. కొచ్చి నుంచి ఖతార్ లోని దోహాకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మస్కట్ కు దారి మళ్లించగా.. కన్నూర్ నుంచి బయలుదేరిన ఇంకో ఎయిరిండియా ఫ్లైట్ ను వెనక్కి తీసుకొచ్చారు. దేశీయంగా దిగ్గజ విమానయాన సంస్థ అయిన ఇండిగో తమ సర్వీసుల్ని రద్దు చేయలేదు. ఈ సంస్థకు చెందిన విమానాలు దుబాయ్.. దోహా.. బహ్రెయిన్.. దామమ్ అబుదాబీ.. కువైట్ తిబ్లిసీ నుంచి రావాల్సిన విమానాలపై మాత్రం ప్రభావం పడింది.

ఇరాన్ నుంచి దాడులు ఆగిపోవటంతో బహ్రెయిన్.. కువైట్ లు తమ గగనతలాన్ని తెరిచాయి. తాత్కాలిక విరామంతో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్లుచెబుతున్నారు. షెడ్యూల్ లో భాగంగా బయలుదేరాల్సిన కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా.. కొన్ని మాత్రం ఆలస్యంగా బయలుదేరాయి. మొత్తంగా భారత్ నుంచి విదేశాలకు విమాన ప్రయాణాలు పెట్టుకున్న వారికి.. ఎప్పుడేం జరుగుతుందో? ఎప్పుడు ఏ సర్వీసు రద్దు అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పక తప్పదు.