హర్మూజ్ నుంచి రెవెన్యూ.. ఇరాన్ అధికారిక ప్రకటన!
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ తొలిసారిగా 'టోల్' వసూలు చేయడం మొదలుపెట్టింది.
By: Madhu Reddy | 24 April 2026 4:00 AM ISTప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ తొలిసారిగా 'టోల్' వసూలు చేయడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఇలా పన్ను వసూలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక భారీ ట్యాంకర్ నుంచి ఏకంగా 2 మిలియన్ డాలర్ల రుసుము వసూలు చేసినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ టోల్ వెనుక ఉన్న నిబంధనలు ఏంటి? ఇరాన్ వ్యూహం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఇరాన్ పార్లమెంట్ అధికారిక ప్రకటన:
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు ప్రారంభమైందని ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్‌రెజా అధికారికంగా ధృవీకరించారు. తొలిసారిగా వసూలైన టోల్ మొత్తం తమ సెంట్రల్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిందని ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. అయితే, ఈ టోల్‌ను ఏ దేశానికి చెందిన నౌక నుంచి వసూలు చేశారనే విషయాన్ని మాత్రం ఇరాన్ ప్రస్తుతానికి రహస్యంగా ఉంచింది. తమ దేశ పునర్నిర్మాణం కోసం ఈ నిధులను వాడుకుంటామని ఇరాన్ గతంలోనే స్పష్టం చేసింది.
టోల్ లెక్కలు.. చమురు బ్యారెల్‌కు ఒక డాలర్:
ఇరాన్ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం, ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ తమ వద్ద ఉన్న సరుకు ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక బ్యారెల్ చమురుకు 1 డాలర్ చొప్పున టోల్ నిర్ణయించారు. తాజాగా ప్రయాణించిన ఒక నౌకలో రెండు మిలియన్ల బ్యారెళ్ల చమురు ఉండటంతో, ఆ యజమానులు ఇరాన్‌కు 2 మిలియన్ డాలర్లు (సుమారు 16 కోట్ల రూపాయలకు పైగా) చెల్లించాల్సి వచ్చింది. ఈ వసూళ్ల ద్వారా ఇరాన్ భారీ ఆదాయాన్ని పొందుతుంది.
కరెన్సీ నిబంధనలు మరియు భద్రత:
ఈ టోల్ చెల్లింపుల విషయంలో ఇరాన్ కొన్ని కఠినమైన షరతులు విధించింది. టోల్ మొత్తాన్ని అమెరికన్ డాలర్లలో కాకుండా, కేవలం చైనీస్ యువాన్ లేదా క్రిప్టో కరెన్సీ రూపంలోనే చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, నౌకలోని సరుకు, చేరుకోవాల్సిన గమ్యం వంటి పూర్తి వివరాలను ముందే టెహ్రాన్ అధికారులకు అందించాలి. ఇక వన్స్ టోల్ చెల్లింపు పూర్తయ్యాక, ఆ నౌకలకు ఇరాన్ సైన్యానికి చెందిన ఐఆర్‌జీసీ (IRGC) నౌకలు రక్షణగా ఉంటూ జలసంధిని దాటిస్తాయని సమాచారం.
ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం:
హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతానికి పైగా ప్రయాణించే కీలక మార్గం. ఇప్పుడు ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇతర దేశాలు ఈ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తాయో చూడాలి. అయితే, ఇరాన్ మాత్రం తన సముద్ర సరిహద్దుల గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే హక్కు తమకు ఉందని బలంగా వాదిస్తోంది.
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సముద్ర మార్గాల్లో ఇలా టోల్ వసూలు చేయడం వల్ల భవిష్యత్తులో రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యులపై భారం పడే ప్రమాదం ఉంది. మరి ఈ కొత్త పన్ను విధానానికి అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఏదేమైనా ఇరాన్ మాత్రం ఈ కొత్త రెవెన్యూ మార్గం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునే పనిలో పడింది.
