అమెరికాతో అణు చర్చలపై ఇరాన్ క్లారిటీ.. మేటర్ మళ్లీ మొదటికి!
అవును... అడిగితే పని అవ్వకపోవడంతో, అణుకేంద్రాలను ధ్వంసం చేశారు ట్రంప్! తానేమిటో చూపించాను కాబట్టి ఇక ఇరాన్ చర్చలకు ముందుకు వస్తుందనే ఆశతో ఉన్నారని అంటారు.
By: Tupaki Desk | 27 Jun 2025 11:29 AM ISTఅణుచర్చలకు ఒప్పించడం కోసం ట్రంప్ పలు ప్రయత్నాలే చేశారని చెప్పొచ్చు. ఇందులో భాగంగా తొలుత మాటలతో చెప్పారు.. సుమారు ఐదు దశల్లో చర్చలు జరిపారు.. అయినా ఫలితం రాలేదని అంటారు! కట్ చేస్తే... ఇజ్రాయెల్ ని పంపించి, అనంతరం తాను ఎంట్రీ ఇచ్చి చేయాల్సిన డ్యామేజ్ చేశారు. ఇప్పుడు మరోసారి చర్చల ప్రస్థావన తెచ్చారు. ఈ సమయంలో ఇరాన్ స్పందించింది.
అవును... అడిగితే పని అవ్వకపోవడంతో, అణుకేంద్రాలను ధ్వంసం చేశారు ట్రంప్! తానేమిటో చూపించాను కాబట్టి ఇక ఇరాన్ చర్చలకు ముందుకు వస్తుందనే ఆశతో ఉన్నారని అంటారు. ఈ సమయంలో ఇరాన్ స్పందించింది. ఇందులో భాగంగా... అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. దీంతో... అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... వచ్చేవారం టెహ్రాన్ తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అణుచర్చలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఈ విషయంలో అమెరికాతో సమావేశమయ్యే ఆలోచన తమకు లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అబ్బాస్ అరాగ్చీ... ఇటీవల తమపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని అన్నారు. ఇదే సమయంలో... ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు. దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు.
ఇందులో భాగంగా... ప్రస్తుతానికి చర్చల టాపిక్ వంటిది ఏమీ లేదని అన్నారు. అయితే, అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు తిరిగి ప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ తో మాట్లాడుతున్నామని తెలిపారు. దీంతో... ఇరాన్ ఈ విషయంలో తగ్గకపోవచ్చని.. తిరిగి అణు కార్యక్రమం పునరుద్ధరణపై సీరియస్ గా దృష్టి సారించొచ్చని చెబుతున్నారు.
కాగా... ఇటీవల జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. వచ్చేవారం టెహ్రాన్ తో అణుచర్చలు జరుపుతామని, ఈ చర్చలద్వారా అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్ తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ తాజాగా పేర్కొంది.
