ఏసీలు ఆఫ్ చేయండి.. ప్రజలకు ఇరాన్ అత్యవసర పిలుపు.. కారణమేంటంటే?
అమెరికా దాడుల ప్రభావంతో ఇరాన్ ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ గ్రిడ్‌లపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో, ప్రజలు తమ ఏసీలను ఆఫ్ చేయాలంటూ ప్రభుత్వం అత్యవసర విజ్ఞప్తి చేసింది.
By: A.N.Kumar | 17 July 2026 11:09 PM ISTయుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు.. అది సామాన్య ప్రజల జీవితాలను.. దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతలా అతలాకుతలం చేస్తుందో చెప్పడానికి ఇరాన్‌లో తాజా పరిస్థితులే నిదర్శనం. అమెరికా దాడుల ప్రభావంతో ఇరాన్ ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ గ్రిడ్‌లపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో, ప్రజలు తమ ఏసీలను ఆఫ్ చేయాలంటూ ప్రభుత్వం అత్యవసర విజ్ఞప్తి చేసింది.
భగభగమండే ఎండల్లో ఊపిరాడని పరిస్థితి
ప్రస్తుతం ఇరాన్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇటువంటి నరకప్రాయమైన ఎండల్లో కూడా కనీసం పీక్ అవర్స్‌లో ఒక గంటైనా ఏసీలను కట్టేయాలని అధికారులు కోరుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ పీక్ అవర్స్‌లో ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సహకరిస్తేనే పవర్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలకుండా కాపాడుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
మౌలిక వసతులపై దాడుల ప్రభావం
ఇటీవల జరిగిన దాడుల వల్ల ఇరాన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, గ్రిడ్‌లు, ఇతర కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో భారీ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. "ఆసుపత్రులు, పరిశ్రమలు, అత్యవసర సేవలకు నిరంతరాయంగా విద్యుత్ అందించడం ఇప్పుడు ప్రాధాన్యత. ఇందుకోసం సామాన్య ప్రజలు కొంత త్యాగం చేయక తప్పదు" అని ప్రభుత్వం తెలిపింది.
కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం
యుద్ధ రంగంలోనే కాకుండా ఇరు దేశాల మధ్య సమాచార యుద్ధం కూడా ముదిరింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము విజయవంతంగా దాడులు చేశామని.. కొన్ని అమెరికన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల వార్తలను అమెరికా పూర్తిగా తోసిపుచ్చింది. తమ స్థావరాలు, యుద్ధ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ముందున్నది మరిన్ని సవాళ్ల కాలమేనా?
ప్రస్తుతం ఇరాన్ ముందున్న సవాలు కేవలం సరిహద్దుల్లో శత్రువుతో పోరాడటం మాత్రమే కాదు. అంతర్గతంగా దేశాన్ని కాపాడుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలైన నీరు, విద్యుత్, ఇంధనాన్ని సమకూర్చడం కూడా పెద్ద టాస్క్‌గా మారింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే.. ఈ వనరుల కొరత మరింత తీవ్రమై ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇరాన్ ప్రజలకు రాబోయే రోజులు అత్యంత కఠినమైన పరీక్షా సమయమేనని చెప్పవచ్చు.
