రూ. 560 కోట్ల సుపారీ..! ట్రంప్, నెతన్యాహూలపై ఇరాన్ పార్లమెంట్‌లో ‘హిట్‌మ్యాన్’ బిల్లు?
ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు డిప్లొమసీ క్లాసుల్లా కాకుండా నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లా మారిపోయాయి.
By: A.N.Kumar | 20 May 2026 11:54 AM ISTప్రపంచ రాజకీయాలు ఇప్పుడు డిప్లొమసీ క్లాసుల్లా కాకుండా నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లా మారిపోయాయి. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య కోల్డ్ వార్.. మరోవైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఎప్పుడు ఏ మిసైల్ ఎటు దూసుకొస్తుందో తెలియని హై-వోల్టేజ్ టెన్షన్. ఈ గ్యాప్‌లో ఇంటర్నేషనల్ మీడియా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ వార్త లీకైంది. అదేంటంటే... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల తలలు నరికితే అక్షరాలా €50 మిలియన్ల బహుమతి ఇస్తామంటూ ఇరాన్ పార్లమెంట్‌లో ఒక బిల్లు పరిశీలనకు వచ్చిందట!
అవును.. మీరు చదివింది నిజమే. మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే... దాదాపు రూ. 560 కోట్లు! ఈ ఫిగర్ వినగానే మనోళ్లు చాలామంది బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మనీ హైస్ట్’ థీమ్ మ్యూజిక్ వేసుకుని.. ప్లాన్‌లు గీయడం కూడా మొదలుపెట్టేసి ఉంటారు. కానీ బాస్... ఇది రియల్ వరల్డ్.. ఇక్కడ రీ-టేక్‌లు ఉండవు!
పబ్ జీ మిషన్ అనుకున్నారా ఏంటి? నెటిజన్ల సెటైర్లు!
ఈ వార్త సోషల్ మీడియాలో ల్యాండ్ అవ్వడమే ఆలస్యం... మీమర్స్, నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఎవరి స్టైల్లో వారు కౌంటర్లు విసురుతున్నారు . "రూ. 560 కోట్లు ఇస్తామంటే సరిపోయిందా.. అది పబ్ జీ మిషన్ అనుకున్నారా ఎయిర్ డ్రాప్ తీసుకోడానికి?" అని ఒకరు. "ట్రంప్ దగ్గరికి వెళ్లాలంటే ముందు అమెరికా సీక్రెట్ సర్వీస్, ఎఫ్ బీఐ , సీఐఏ డ్రోన్లు, స్నైపర్లు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు దాటాలి. అవన్నీ దాటాక ట్రంప్ హెయిర్ స్టైల్ మార్చుకుని కూర్చుంటే గుర్తుపట్టడం ఇంకో టాస్క్!" అంటూ మరొకరు సెటైర్లు వేస్తున్నారు.
'ఇంపాజిబుల్ లెవెల్' సెక్యూరిటీ గేమ్!
నిజంగానే ఈ ఇద్దరు నేతల భద్రత గురించి మాట్లాడటం అంటే... వీడియో గేమ్‌లో అత్యంత కష్టమైన "ఇంపాజిబుల్ లెవల్’’ ని వన్ లైఫ్‌తో క్లియర్ చేయడమే. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆయన చుట్టూ ఒక అదృశ్య గోడలా ఉంటుంది. ఆయన నడిచే దారి, తాగే నీరు, పీల్చే గాలి కార్ లోపల కూడా అన్నీ వందల సార్లు స్క్రీనింగ్ జరుగుతాయి. ఎంత పెద్ద ‘హిట్‌మ్యాన్’ అయినా అక్కడ పప్పులు ఉడకవు.
బెంజమిన్ నెతన్యాహూ భద్రత
ఇక నెతన్యాహూ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'మొసాద్' ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. శత్రువు ఏం ఆలోచిస్తున్నాడో కూడా ముందే పసిగట్టే నెట్‌వర్క్ వాళ్లది. అలాంటి నెతన్యాహూ జోలికి వెళ్లడం అంటే కందిరీగల తుట్టెను కదిలించడమే.
పొలిటికల్ మసాలా కాదు.. ఇది పెట్రోల్!
సోషల్ మీడియాలో దీనిపై జోకులు పేలుతున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు మాత్రం గడ్డం గీరుకుంటూ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఇరాన్ పార్లమెంట్ నుంచి ఇలాంటి సంకేతాలు రావడం అంటే... ఇప్పటికే మంటలతో తగలబడుతున్న మిడిల్ ఈస్ట్‌లో మరికొంత పెట్రోల్ పోయడమే అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అధికారిక ప్రకటనలు దౌత్య సంబంధాలను పూర్తిగా ఖూనీ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొందరేమో ఇదంతా కేవలం ఇరాన్ ఆడుతున్న "పొలిటికల్ మైండ్ గేమ్" అని కొట్టిపారేస్తుంటే ఇంకొందరేమో "ఈ మధ్య ప్రపంచ రాజకీయాలు చూస్తుంటే హాలీవుడ్ డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్‌లు రాయడం మానేసి రిటైర్ అయిపోతారేమో" అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుత ప్రపంచం డిప్లొమసీతో కాదు, డైలాగులు మరియు డ్రోన్లతో నడుస్తోందని మాత్రం స్పష్టమవుతోంది!
