పాకిస్థాన్ కు థాంక్స్ చెప్పిన ఇరాన్... ఏమి జరుగుతుంది?
పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 2:00 PM ISTపశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఎవరికివారు ఏమాత్రం తగ్గేదేలే అంటూ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో తమకు పాకిస్థాన్ మద్ధతు ప్రకటించిందంటూ ఇరాన్ థాంక్స్ చెప్పింది. ఈ సమయంలో సరిహద్దుల్లో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు పాకిస్థాన్ మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇరాన్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పేర్కొంటూ.. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో... పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్... సవాలుతో కూడిన సమయంలో పాకిస్థాన్ ప్రజలు, పార్లమెంట్.. ఇరాన్ కు అండగా నిలిచాయని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమనను ఖండించడంతో పాటు పార్లమెంటులో మద్దతు ఇవ్వడం రెండు దేశాల మధ్య సంఘీభావాన్ని బలపరుస్తుందని అన్నారు.
ఈ సమయంలో ఇరాన్ పార్లమెంట్ లో.. థాంక్యూ పాకిస్థాన్ నినాదాలు మారుమ్రోగాయి. మరోవైపు... ఇరాన్ శాస్త్రవేత్తలను హతమార్చడం ద్వారా దేశ అణ్వాయుధ సామర్థ్యాలు అంతమవుతాయని శత్రువు నమ్మితే అది మోసపోయినట్లే అవుతుందని అన్నారు. ఇరాన్ అణు విధానాన్ని శాంతియుత లక్ష్యాలవైపు నడిపించే సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ డిక్రీని అధ్యక్షుడు ఆమోదించారు.
మరోవైపు... పొరుగున ఉన్న ఇరాన్ తో ఉన్న అన్ని సరిహద్దు క్రాసింగ్ లను నిరవధికంగా మూసివేసినట్లు పాకిస్థాన్ ప్రాంతీయ అధికారులు తెలిపారు. చాహి, పంజ్ గురు, వాషుక్, కెచ్, గ్వాదర్.. జిల్లాలో సరిహద్దులను నిలివేసినట్లు.. ఇరాన్ సరిహద్దుల్లో గల బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని సీనియర్ అధికారి ఖాదిర్ బఖ్ష్ పిర్కానీ తెలిపారు.
కాగా.. సున్నీ ముస్లింలు అధికంగా ఉన్న పాకిస్థాన్.. షియా ముస్లింలు అధికంగా ఉన్న ఇరాన్ తో సుమారు 900 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది! ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 3 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉండగా.. రాబోయే రోజుల్లో దీన్ని 10 బిలియన్ యూఎస్ డాలర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు!
