Begin typing your search above and press return to search.

ఈ సారి బుల్లెట్ దిగుద్ది... ట్రంప్ కు ఇరాన్ నుంచి మాస్ వార్నింగ్ వైరల్!

అవును... నిరసనకారులపై బుల్లెట్లతో అణచివేతకు పాల్పడుతోన్న ఇరాన్‌ పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కన్పించట్లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది!

By:  Raja Ch   |   15 Jan 2026 11:21 AM IST
ఈ సారి బుల్లెట్ దిగుద్ది... ట్రంప్ కు ఇరాన్ నుంచి మాస్ వార్నింగ్ వైరల్!
X

దాదాపు రెండు వారాలుగా ఇరాన్ నెత్తురోడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న నిరసనలు, వాటిని అడ్డుకొవడానికి తుపాకులకు పనిచెబుతోన్న భద్రతా దళాల చర్యలతో ఆదేశం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యం అని అంటున్నారు. ఆ దేశంపై మరికొన్ని గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో.. ఇరాన్ నుంచి ట్రంప్ కు ఓ షాకింగ్ వార్నింగ్ వెలువడింది.

అవును... నిరసనకారులపై బుల్లెట్లతో అణచివేతకు పాల్పడుతోన్న ఇరాన్‌ పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కన్పించట్లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది! ఆ దేశంలోని ఆందోళనకారులకు ముందునుంచీ మద్దతు పలుకుతోన్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు టెహ్రాన్‌ పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ పై ఇరాన్‌ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఇందులో భాగంగా... ఈసారి బుల్లెట్‌ గురి తప్పదని హెచ్చరించింది. దీంతో.. ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా... 2024లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ... ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపు సందేహాన్ని టెలీకాస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ వైపు ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా అని ఒకరంటే.. మరికొన్ని గంటల్లో అని ఇంకొకరు అంటున్న వేళ.. ఇరాన్ నుంచి వచ్చిన ఈ బెదిరింపులు సంచలనంగా మారాయి.

కాగా... 2024 జులైలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. అతనిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. ముఖంపై రక్తం చిమ్మింది. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను చుట్టుముట్టారు. ఈ హత్యాయత్నం వెనక ఇరాన్‌ ఉన్నట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది కూడా. ఈ నేపథ్యంలో.. తాజాగా "ఈ సారి బుల్లెట్ గురి తప్పదు" అని ఇరాన్ నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం!

మరికొన్ని గంటల్లో అమెరికా సైనిక చర్య!:

ఇరాన్‌ పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది! ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రధానంగా... ఇరాన్‌ కు దగ్గరలో ఖతార్‌ లో ఉన్న తమ కీలక అల్‌-ఉదెయిద్‌ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తోంది.

ఇదే సమయంలో... అమెరికా, దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్‌-ఉదెయిద్‌ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్‌ ను ప్రారంభించాయని చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్‌ లోని ఓ మిలిటరీ స్థావరం నుంచి బ్రిటన్‌ కూడా సిబ్బందిని ఉపసంహరించుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఇరాన్ పై అమెరికా సైనిక చర్య ఉండొచ్చనే చర్చ మొదలైంది.