ఇరాన్ ప్రెసిడెంట్ కి మోడీ ఫోన్... ఖోర్రామ్ షహార్-4 ప్రయోగించిన టెహ్రాన్!
అవును... ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 11:18 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న వేళ.. శనివారం అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. దీంతో.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మరింత ఉదృతంగా మారిపోయాయి! ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రెసిడెంట్ కు మోడీ ఫోన్ చేశారు.
అవును... ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా... పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని 'ఎక్స్' లో వెల్లడించిన మోడీ... ప్రస్తుత పరిస్థితి గురించి ఇరాన్ ప్రెసిడెంట్ తో వివరంగా చర్చించినట్లు తెలిపారు. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసామని.. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం ముఖ్యమని చెబుతూ దౌత్యం కోసం పిలుపును పునరుద్ఘాటించామని అన్నారు.
ఇదే సమయంలో.. ఇరాన్ పై అమెరికా దాడులతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారుతున్న వేళ పలు దేశాల నుంచి ఇరాన్ కు కాల్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత, సంక్షోభానికి చర్చల ద్వారా పరిష్కారం చూపాలని అన్ని పక్షాలను కోరుతున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ తెలిపారు.
ఇదే సమయంలో... జర్మనీ ప్రతిపక్ష నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ స్పందిస్తూ... ఇరాన్ ను అమెరికా, ఇజ్రాయెల్ తో అత్యవసరంగా దౌత్య చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో... మరింత సైనిక ఘర్షణపై శాంతియుత పరిష్కారం, చర్చల కోసం బెర్లిన్ ఒత్తిడి చేస్తోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మరోవైపు... అమెరికా దాడుల అనంతరం ఇరాన్ మరింత ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై ప్రతీకార క్షిపణి కాల్పులు మునుపటి కంటే భారీగా కనిపించాయని అంటున్నారు. ఈ తాజా దాడుల్లో 86 మంది గాయపడ్డారని టెల్ అవీవ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ క్రమంలో... అమెరికా దాడి అనంతరం ఇజ్రాయెల్ పై ఇరాన్ కనీసం 40 క్షిపణులను ప్రయోగించిందని.. వాటిలో ఖోర్రామ్ షహార్ - 4 ఒకటని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐ.ఆర్.జీ.సీ.) వెల్లడించింది. ఈ క్షిపణి 2,000 కి.మీ పరిధి, 1500 కిలోల వార్ హెడ్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.
