తెరపైకి ఇరాన్ తదుపరి లీడర్ పేరు... ట్రంప్ పై నమ్మకమా?
ఖమేనీని హతమారిస్తేనే ఈ యుద్ధానికి ముగింపు ఉంటుంది అని నెతన్యాహు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ పై చర్చ మొదలవ్వడం గమనార్హం.
By: Tupaki Desk | 19 Jun 2025 4:00 AM ISTఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో తమకు తెలుసని.. అతడిని లక్ష్యంగా చేసుకోవడం చాలా సులభమని.. అయినా కూడా ప్రస్తుతానికి ఆయన్ను చంపే ఉద్దేశం లేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమేనీని హతమారిస్తేనే ఈ యుద్ధానికి ముగింపు ఉంటుంది అని నెతన్యాహు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ పై చర్చ మొదలవ్వడం గమనార్హం.
అవును... ఖమేనీని ఇప్పుడు చంపే ఉద్దేశ్యం లేదని ట్రంప్ చెప్పడం.. ఖమేనీని హతమారిస్తే యుద్ధం ముగిసినట్లేనని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన అనంతరం.. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ పై చర్చ మొదలైంది. పైగా.. ఇప్పటికే ఖమేనీ కుటుంబంతో సహా రహస్య స్థావరంలో ఉన్నారని అంటే.. ఆ ప్రాంతపై ఇజ్రాయెల్ బుధవారం సాయంత్రం దాడి చేసిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి తాజాగా యుద్ధం మొదలైన తర్వాత.. అటు ఇరాన్, ఇటు అమెరికా నుంచి ఖమేనీపై ఒత్తిడి పెరుగుందని అంటున్నారు. మరోవైపు ఆయనకున్న అత్యంత నమ్మకమైన సలహాదారులను వరుసగా ఐడీఎఫ్ హతమారుస్తుండటం కూడా ఆయనపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని చెబుతున్నారు.
వాస్తవానికి గత కొంతకాలంగా అంతర్గతంగానూ, అంతర్జాతీయంగానూ ఇరాన్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను నియంత్రించేందుకు సైన్యం ప్రయత్నిస్తుంది. మరోవైపు పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అంటున్నారు.
సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఇజ్రాయెల్ తో యుద్ధం మొదలైంది. ఈ సమయంలో.. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరుని ఇస్లామిక్ రిపబ్లిక్ తెరపైకి తెచ్చింది. ఈయనకు తదుపరి సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈయన గత 20 ఏళ్లుగా పాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.
తన తండ్రి హయాంలోనూ.. వివిధ రాజకీయ వర్గాలు, మతపెద్దలు, సైనిక అధికారులను సమన్వయం చేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అని అంటున్నారు. దీనికి తోడు.. ఇరాన్ లోని శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్ తోనూ మొజ్తబాకు బలమైన సంబంధాలు ఉన్నాయని.. అందుకే అలీ ఖమేనీ తదుపరి వారసుడిగా మొజ్తాబానే అని చెబుతున్నారు!
ఏది ఏమైనా... ఇరాన్ కు సుమారు మూడున్నర దశాబ్ధాలుగా ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఖమేనీని అంతమొందిస్తే యుద్ధం ఆగినట్లని ఇజ్రాయెల్.. ఎక్కడున్నారో తెలిసినా ఇప్పుడు చంపమని అమెరికా చెబుతోన్న నేపథ్యంలో.. తదుపరి సుప్రీం లీడర్ గురించి అప్పుడే చర్చ మొదలవ్వడం మాత్రం.. కచ్చితంగా ట్రంప్ - నెతన్యాహు ధ్వయంపై ఇరాన్ కున్న నమ్మకమేమో అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
