Begin typing your search above and press return to search.

'మెరుపు కవచం' బయటకు తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్ వల్ల అవుతుందా?

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 11:08 PM IST
మెరుపు కవచం బయటకు తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్ వల్ల అవుతుందా?
X

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులతో చెలరేగిపోతోంది. మరోవైపు గతంలో హమాస్‌, హెజ్‌ బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్‌ ను ఛేదించుకుని మరీ ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయి.

టెల్ అవీవ్ లోని పలు కీలక ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఇరాన్ వద్ద ఉన్న కొన్ని ప్రత్యేకమైన క్షిపణులను అడ్డుకునే విషయంలో ఐరన్ డోమ్ కు చిల్లు పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా... ఇజ్రాయెల్ లోని మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్ క్షిపణులు దాడి చేయడంతో.. మెరుపు కవచాన్ని బయటకు తీయాలని టెల్ అవీవ్ ఫిక్సయ్యింది.

అవును... హమాస్‌, హెజ్‌ బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థ "ఐరన్ డోమ్" కు ఇరాన్‌ తూట్లు పొడిచిందని అంటున్నారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా ఫేమస్. ఇది ఒక అద్బుతం అని చెబుతారు! గతంలో ఉగ్రవాదులు ప్రయోగించిన వందలాది రాకెట్లను ఈ వ్యవస్థ గాల్లోనే పేల్చేసింది. అయితే.. తాజాగా అది కాస్త బలహీన పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో "మెరుపు కవచం" గా పిలిచే సరికొత్త, అధునాతన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ బయటకు తీసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని మధ్యదరా సముద్రం తీరంలోని ఇజ్రాయెల్ జలాల్లో మొహరించిందని తెలుస్తోంది. దీంతో.. ఏమిటీ కవచం.. ఎలా పనిచేస్తుంది.. దీన్ని ఛేధించడం ఇరాన్ క్షిపణుల వల్ల అవుతుందా అనే ఆసక్తి తెరపైకి వచ్చింది.

ఇజ్రాయెల్ ముద్దుగా "బరాక్ మెగెన్" అని పిలుచుకునే ఈ గగనతల రక్షణ వ్యవస్థకు హిబ్రూ భాషలో లైటెనింగ్ షీల్డ్ అని అర్ధం. అంటే.. మెరుపు కవచం అన్నమాట! ఇది ఆ దేశ అత్యాధునిక నేవీ రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల దాడుల నుంచి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థను రూపొందించింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.

వాస్తవానికి ఈ రక్షణ వ్యవస్థను తొలిసారిగా నవంబర్ 2022లోనే పరీక్షించారు. ఇందులో భాగంగా... సార్-6 యుద్ధనౌక నుంచి ఐ.ఎన్.ఎస్. మెగైన్ ను పరీక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇది రాడార్, కమాండ్ సిస్టంస్ ఆదేశానుసారం పని చేస్తుంది. శత్రు క్షిపణులను దూరం నుంచే గమనించి దాడి చేస్తుంది.

ఇందులో భాగంగా... స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, సుదూర శ్రేణి లక్ష్యాలను కూడా బరాక్‌ మెగెన్‌ ఛేదించగలదు. నౌక ఉపరితలం నుంచి ప్రయోగించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. ఇది 360 డిగ్రీల కోణంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో... ఈ మెరుపు కవచాన్ని దాటుకుని ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ పై ఏ మేరకు దాడి చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.