Begin typing your search above and press return to search.

1200 కి.మీ. రేంజ్... ఇజ్రాయెల్ పై ఇరాన్ స్పెషల్ క్షిపణి స్పెషాలిటీస్ ఇవే!

ఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Jun 2025 12:57 PM IST
1200 కి.మీ. రేంజ్... ఇజ్రాయెల్ పై ఇరాన్ స్పెషల్ క్షిపణి స్పెషాలిటీస్  ఇవే!
X

ఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా అన్నట్లుగా ఇరు వైపులా దాడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ అయిదు విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇవి ఐరన్ డోమ్ ను ఛేధించుకుని వెళ్లడం గమనార్హం.

అవును... టెల్ అవీవ్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇవి.. ప్రపంచ ప్రఖాతి గాంచిన ఇజ్రాయెల్ గగన తల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను ఛేధించుకుని వెళ్లాయి. ఈ క్రమంలో నేరుగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకాయి. దీంతో... టెల్ అవీవ్ వణికిపోతోందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్... ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించామని ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ వీటిని కూడా వినియోగిస్తోందని అన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్‌ 1200 కిలోమీటర్లు అని ఇరాన్‌ పేర్కొంది. ఇది మధ్యలో తన గమనాన్ని మార్చుకోగలదని.. అందుకే ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో... దీనికి ఐ.ఆర్‌.జీ.సీ. ఖుద్స్‌ ఫోర్స్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు ఇరాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కాగా... మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఇరాన్‌ రక్షణ మంత్రి అజిజ్‌ నసీర్‌ జాదా... తమ వద్ద సరికొత్త బాలిస్టిక్‌ మిసైల్‌ సిద్ధమైందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది అమెరికా థాడ్‌, పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించుకొని వెళ్లగలదని పేర్కొన్నారు.

ఈ విధంగా ఇరాన్‌ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌ అవీవ్‌ తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకిర్యా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో... పౌర నివాస ప్రాంతాల్లోనూ పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో... ఈ దాడుల్లో కనీసంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపైగా స్థానికులు గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఏడుగురు ఐడీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపాయి.