Begin typing your search above and press return to search.

అమెరికాకు గాయం... ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం!

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 3:16 PM IST
అమెరికాకు గాయం... ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో పశ్చిమాసియా మరోసారి మండుతోన్న సంగతి తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ప్రతిదాడులు చేసింది. ఈ సందర్భంగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ లోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది!

అవును... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యుద్ధంలో తమ ప్రమేయం లేదని.. ఇజ్రాయెల్ కు అమెరికా సహకరించడం లేదని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అవి అసత్యాలని, ఇజ్రాయెల్ కు అమెరికా సహకరిస్తోందని ఇరాన్ వాదిస్తోంది. ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకొంది. ఈ దాడిలో యూఎస్ దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ లోని అమెరికా దౌత్యవేత్త మైక్‌ హకేబీ ధ్రువీకరించారు. సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో... "వాట్ నెక్స్ట్" అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన వాటిపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా క్షిపణి దాడులతో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని టచ్ చేయడంతో.. దీనిపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ తో అధికారికంగా అమెరికా తోడైతే పరిణామాలు ఎలా ఉంటాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌ లోని టెల్ అవీవ్, హైఫా ఓడరేవు నగరాన్ని తాకాయి. కొన్ని అపార్ట్ మెంట్లను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఇరాన్ దాడుల్లో 9 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. హైఫా ఓడరేవు నగరంలో కార్యకలాపాలు జరుగుతున్నందున సుమారు 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్ ఘాటు హెచ్చరికలు!:

ఇలా ఇరాన్ దాడుల్లో తమ పౌరులు మృతి చెందడం, గాయాలపాలవ్వడంపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఇందులో భాగంగా.. తమ పౌరులపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు టెహ్రాన్‌ నగర ప్రజలు మూల్యం చెల్లించుకొంటారని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఖట్జ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీని ఉద్దేశించి.. ఖట్జ్‌ తన టెలిగ్రామ్‌ ఛానెల్‌ లో ఓ కీలక పోస్టు పెట్టారు.

ఇందులో... గర్వం నిండిన ఆ నియంత ఇప్పుడు హంతకుడిలా మారాడని.. ఉద్దేశ్యపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ ను నిలిపివేయించాలనే ఉద్దేశ్యంతో పౌరుల గృహాలను లక్ష్యంగా చేసుకొంటున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా... టెహ్రాన్ ప్రజలు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తారని ఖట్జ్ హెచ్చరించారు.