Begin typing your search above and press return to search.

మూడు నౌకల్లో మంటలు.. హర్మోజ్ లో ఏమి జరుగుతోంది?

అవును... పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు హర్మూజ్‌ జలసంధికి పాకినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Jun 2025 11:16 AM IST
మూడు నౌకల్లో మంటలు.. హర్మోజ్ లో ఏమి జరుగుతోంది?
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో భీకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. .ఆ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ కు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధికి పాకినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా.. గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో నౌకలు తగలబడుతున్నట్లు తెలుస్తోంది.

అవును... పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు హర్మూజ్‌ జలసంధికి పాకినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా.. ఇరాన్‌, ఒమన్‌ తీరాల సమీపంలో మూడు నౌకలు తగలబడుతున్నట్లు తెలుస్తోంది. నాసాకు చెందిన ఫైర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌ మ్యాప్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో.. ఈ విషయం షాకింగ్ గా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఖోర్ ఫక్కన్ కు తూర్పున 22 నాటికల్ మైళ్ల దూరంలో హోర్మూజ్ జలసంధి సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా... అరేబియా సముద్రంలో ఒమన్‌, ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ జలసంధి నుంచి నిత్యం సుమారు 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుతుంది. ఇందులో భాగంగా... ఈ జలసంధి ద్వారా ఇరాన్‌, సౌదీ, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ ల నుంచి ఎగుమతి అవుతోంది. లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్.ఎన్.జీ) రవాణాకు కూడా ఇది అత్యంత కీలకం.

ఇందులో భాగంగా... మూడింట ఒక వంతు ఎల్‌.ఎన్‌.జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్‌ ఎగుమతి చేస్తుంది. ఇలా చమురు రవాణా విషయంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికించేస్తుందని అంటారు.

గతంలో ఇరాన్ - ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉందంటే.. ఇది ఎంత ముఖ్యమైందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. 1980-88 వరకు జరిగిన ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధం ప్రభావం మాత్రం ఈ జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు.. ట్యాంకర్లపై దాడులు చేసుకొన్నాయి. దీనిని "ట్యాంకర్‌ వార్‌" అని కూడా అంటారు.