Begin typing your search above and press return to search.

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ నే కాదు.. ప్రపంచాన్ని సైతం ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయా?

లోకంలో శాంతి కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించినప్పుడే దాని పరమావధి పూర్తవుతుందని చెప్పవచ్చు.

By:  Tupaki Political Desk   |   3 March 2026 4:47 PM IST
అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ నే కాదు.. ప్రపంచాన్ని సైతం ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయా?
X

లోకంలో శాంతి కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించినప్పుడే దాని పరమావధి పూర్తవుతుందని చెప్పవచ్చు. కానీ, ఇప్పుడు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, మానవత్వం కంటే అహంకారానికే పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు కేవలం రెండు దేశాల గొడవగా మిగిలిపోలేదు. ఇది ప్రపంచ వినాశనానికి దారితీసే ఒక పెద్ద ప్రళయంలా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌ను అణచివేయాలని చూశాయి కానీ, ఆ వ్యూహం ఇప్పుడు వికటించి వారికే ఎదురుదెబ్బ తగులుతోంది.

అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ

అమెరికా అంటే తిరుగులేని సైనిక శక్తి అని మనందరికీ తెలిసిందే. అయితే, ఈ యుద్ధంలో అమెరికాకు ఎన్నడూ లేని విధంగా అసాధారణ నష్టం జరుగుతోంది. ఇరాన్ తన దగ్గరున్న అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా సైనికులు ఇరాన్ దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలోనే పెద్ద దుమారం రేపుతోంది. ‘టెక్నాలజీతో ఇరాన్‌ను క్షణాల్లో తుడిచిపెట్టేయవచ్చు’ అనుకున్న పెంటగాన్ ఆలోచనలు తలకిందులయ్యాయి. ఇరాన్ అనుసరిస్తున్న గెరిల్లా తరహా దాడులు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఇరాన్ ‘సర్వనాశనం’ వ్యూహం

మరోవైపు ఇరాన్ వైఖరి కూడా ప్రమాదకరంగానే మారింది. ‘మేము నాశనమైతే ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వం’ అనే మొండి పట్టుదలతో ఉంది. తమ దేశంలోని మౌలిక సదుపాయాలు పోయినా పర్వాలేదు కానీ, పోతూ పోతూ శత్రువుకు కోలుకోలేని దెబ్బ తీయాలనేది ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే వారు అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇది ఒక దేశం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఆత్మాహుతి పోరాటంలా కనిపిస్తోంది. యుద్ధం అంటే వినాశనం అని తెలిసినా, ఇలాంటి మొండితనం వల్ల లోకానికి తీరని నష్టం జరుగుతోంది.

ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం

ఈ యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలు నష్టపోవడం కాదు..గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఆగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని వల్ల ప్రతి వస్తువు ధర పెరిగిపోయి సామాన్యుడి బతుకు భారంగా మారబోతోంది. ఐరోపా నుంచి ఆసియా వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. అమెరికాపై కూడా ఈ ప్రభావం ఉంది. అటు యుద్ధానికి అవుతున్న ఖర్చులు, ఇటు దేశంలో పెరుగుతున్న ధరలు అమెరికాను తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసేలా ఉన్నాయి.

శాంతి మార్గమే శరణ్యం

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణులు మాత్రమే కాదు.. లక్షలాది మంది సామాన్యుల కన్నీళ్లు, ముక్కలైపోయిన కుటుంబాలు. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ వినాశనాన్ని తప్ప ఏమీ మిగల్చలేదు. ఇప్పటికీ కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా సాధించింది ఏం లేకపోగా.. ఉక్రెయిన్ మాత్రం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. యుద్ధం దేన్నీ ఇవ్వలేదని తెలిసినా, నేటి నాయకులు అదే బాటలో పయనించడం బాధాకరం. బాంబులతో సమస్యలు పరిష్కారం కావని, అవి భవిష్యత్తులో మరిన్ని గొడవలకు బీజం వేస్తాయని ఇప్పటికైనా గ్రహించాలి.

అమెరికా, ఇజ్రాయెల్ తమ మొండివైఖరిని వీడకపోయినా, లేదా ఇరాన్ తన దాడులను ఆపకపోయినా.. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉంది. ఇక్కడి నుంచి శాంతి వైపు అడుగులు వేయకపోతే, రేపు మనం చూసేది కేవలం శ్మశాన వైరాగ్యం మాత్రమే. బాంబుల మోత కంటే సంప్రదింపుల మాటే మేలు. లోకమంతా శాంతితో ఉండాలని, ఈ రక్తపాతం ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.