టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ స్వైర విహారం.. 4వ రోజు జరిగిందిదే!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం పీక్స్ కి చేరుతుండటంతో నాలుగో రోజైన సోమవారం పశ్చిమాసియాలో మరింత భీకర పరిస్థితులు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 17 Jun 2025 9:45 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం పీక్స్ కి చేరుతుండటంతో నాలుగో రోజైన సోమవారం పశ్చిమాసియాలో మరింత భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీతో.. టెల్ అవీవ్ తోపాటు మరిన్ని నగరాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దీనికి తగినట్లుగానే ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
అవును... నాలుగో రోజు ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పోటాపోటీగా యుద్ధం జరిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన దాడుల్లో 8 మంది పౌరులు మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది. దీనికి తగ్గట్లుగానే ఇజ్రాయెల్ దీటుగానే స్పందించింది. ఇందులో భాగంగా.. టెహ్రాన్ పై విరుచుకుపడింది.
టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. అవిరామంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ (ఐ.ఆర్.ఐ.బీ) భవనంపై మిస్సైల్ ను ప్రయోగించింది. స్టూడియోలో మహిళ న్యూస్ రీడర్ లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలోనే మిస్సైల్ దాడి జరగడం గమనార్హం.
ఇలా ఇజ్రాయెల్ బాంబు దాడులు విపరీతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో.. టెహ్రాన్ నివాసితులు పెద్ద సంఖ్యలో ఇరాన్ రాజధాని నుంచి వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో టెహ్రాన్ నుంచి ఉత్తరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడినట్లు చూపించే పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)... టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని తెలిపింది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై అనుకున్న చోట దాడులు చేయగలవని పేర్కొంది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలో మూడోవంతు భాగాన్ని తాము ఇప్పటికే నాశనం చేశామని తెలిపింది.
ఈ విషయాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఐడీఎఫ్ చెప్పిన విషయాన్ని ధృవీకరించారు. టెహ్రాన్ గగన తలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని.. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామని.. ఈ యుద్ధంలో ఇవి కీలక మలుపులని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి సోమవారం తాకింది. ఈ దాడిలో దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపారు.
