బాలిస్టిక్ క్షిపణులకంటే ప్రమాదం... ఇజ్రాయెల్ పై ఏమిటీ ‘క్లస్టర్’ బాంబులు?
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది.
By: Tupaki Desk | 20 Jun 2025 10:21 AM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. రకరకాల క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటి దాడిలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయం దెబ్బతిందని అంటున్నారు. ఈ నేపథ్యం క్లస్టర్ బాంబులు ప్రయోగించింది!
అవును... ఇరాన్ వద్ద పెద్ద మొత్తంలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని.. ఇవి అణుబాంబుల్లా చాలా ప్రమాదమని.. తమలాంటి చిన్న ప్రాంతాలపైకి అవి ఒకేసారి దూసుకొస్తే అత్యంత ప్రమాదమని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఆరోపిస్తుంది ఇజ్రాయెల్. ఇవి బాలిస్టిక్ కంటే డేంజర్ అని చెబుతోంది.
యుద్ధం మొదలైనప్పటినుంచి టెహ్రాన్ తొలిసారి వీటిని ఉపయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ క్షిపణి వార్ హెడ్ 7 కి.మీ. ఎత్తులో ఉండగా పేలి.. 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి.. పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని.. ఇరాన్ కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని ఇజ్రాయెల్ చెబుతోంది.
ప్రధానంగా... గురువారం ఇజ్రాయెల్ లోని బీర్షెబాలో ఓ ఆసుపత్రిని తాకిన క్షిపణి ఈ క్లస్టర్ బాంబునకు చెందినదిగా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఆస్పత్రితో పాటు పలు నివాస భవనాలను ఇది లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సుమారు 230 మందికి గాయలయ్యాయని టెల్ అవీవ్ వెల్లడించింది. దీంతో... ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరిస్తోంది.
ఇలా తమ దేశంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఆ దాడిలో సుమారు 230 మంది గాయపడటంతో పాటు... టెల్ అవీవ్ లోని నివాస ప్రాంతాల్లోనూ ఇరాన్ క్షిపణులు దాడి చేయడం.. అక్కడ 40 మంది వరకూ గాయపడటంతో ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఖమేనీని అంతమొందించి తీరతామని ఘాటుగా హెచ్చరించింది.
ఈ సందర్భంగా బీషెబాలోని ఆస్పత్రిని సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని... తమ దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. మాటలతో కాదు చేతల్లోనే చూపిస్తామని.. యుద్ధ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించలేమని అన్నారు.
ఏమిటీ క్లస్టర్ బాంబు..?:
సాధారణంగా క్షిపణులు, ఇతర బాంబులు అనే వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. దాన్ని ప్రయోగించినప్పుడు ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో అయితే... వందలకొద్దీ చిన్న బాంబులు ఉంటాయి. దీనిని ప్రయోగించిన తర్వత, అది నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ చుట్టూ దూరంగా వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరిగేలా చేస్తుంది.
సాధారణంగా ఇవి 450 నుంచి 500 కిలోల బరువు ఉంటాయి. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు చిన్న బాంబులను కలిగి ఉంటాయి. క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా చిన్న బాంబులను విడుదల చేస్తుంది.
