షాకింగ్: ఇరాన్ లో తీవ్ర ఆందోళన... ప్రభుత్వం ప్రజలపై పడనుందా?
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన భీకర యుద్ధం.. అమెరికా ఫినిషింగ్ టచ్ తో ముగిసింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 12:00 AM ISTపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడినట్లే ఉన్నాయి. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 12వ రోజుకు చేసుకున్న తర్వాత ఆగింది! క్షిపణులు, డ్రోన్లతో భీకరంగా జరిగిన ఈ దాడుల్లో సుమారు 606 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, మరణాల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని మానవ హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ ప్రజలు ప్రపంచానికి షాకింగ్ విషయాలు చెప్పారు.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన భీకర యుద్ధం.. అమెరికా ఫినిషింగ్ టచ్ తో ముగిసింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ పౌరులు... తమను పాలిస్తున్న ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం దారుణాలను వివరించారు. ఈ యుద్ధం వల్ల అమెరికా హ్యాపీ, ఇజ్రాయెల్ హ్యపీ, ఇరాన్ కూడా హ్యాపీ.. కానీ, బాధపడుతుంది (ఇరాన్) ప్రజలు మాత్రమే అని వ్యాఖ్యానించారు.
తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు వచ్చి ఇరాన్ లోని అణు, సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.. ఇదే సమయంలో.. ఇరాన్ వెళ్లి ఖతార్ లోని అమెరికా స్థావరాలపై కొన్ని మిసైళ్లతో దాడి చేసింది.. ఫలితంగా... అటు ఆ రెండు దేశాలు, ఇటు ఇరాన్.. ఉన్నంతలో సంతృప్తి చెందాయి. కానీ, ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది, బాధపడింది ఎవరంటే.. ఇరాన్ ప్రజలే అని చెబుతున్నారు టెహ్రాన్ పౌరులు!
ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రభుత్వంపై తమకున్న అభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని ఇరాన్ పౌరులు బయటపెట్టారు. ఇందులో భాగంగా... యుద్ధం సృష్టించే విధ్వంసం, ఆంక్షలు, చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ.. ఇదంతా ప్రభుత్వ దురాశ వల్లే అని ఒకరంటే... తమకు యుద్ధం వద్దు, ఈ ఆంక్షలు వద్దు, ఈ కాల్పుల విరమణ కూడా వద్దు. తాము కోరుకునేదల్లా.. మేం ఎంతో ప్రేమించే ఈ దేశంలో మనశ్శాంతితో జీవించడమే అని ఇంకొకరు స్పందించారు.
ఇదే సమయంలో... యుద్ధం కంటే తమను ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే.. గాయపడిన, అవమానపడిన ఇస్లామిక్ రిపబ్లిక్.. అమెరికాపై గెలవలేకపోయామనే ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఇప్పుడు ఇరాన్ ప్రజలపై చూపిస్తుంది.. ఉరిశిక్షలు, వేధింపులను రెట్టింపు చేస్తారు అని మరొకరు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా... 2022లో వ్యాపించిన ఆందోళనలను అణిచివేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను గుర్తుకు తెచ్చారు.
ఇందులో భాగంగా... గత ఏడాది ఇరాన్ లో సుమారు 901 మందికి ఉరిశిక్ష వేసినట్లు యూఎన్ మానవ హక్కుల విభాగం చీఫ్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు. అదేవిధంగా... యుద్ధం వల్ల ఏర్పడిన నష్టాన్ని ప్రజలే భరించాల్సి ఉంటుందని, ప్రభుత్వాలు కావని.. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కాకుండా.. మిలిటరీ, అణు సామర్థ్యాలను తిరిగి అభివృద్ధి చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఇంకొకరు చెప్పారు.
ఇదే క్రమంలో... కాల్పుల విరమణను తాను నమ్మడంలేదని.. వారి వల్ల అలాంటివి జరగవని మరో ఇరాన్ పౌరుడు తమ ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయంతో నమ్మకంగా చెప్పగా... ఈ ఒప్పందం కచ్చితంగా ముగిసిపోతుందని అన్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ తన లక్ష్యాలను ఇంకా సాధించలేదని.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్ నుంచి బయటికి వచ్చేందుకు ఈ కాల్పుల విరమణ ఒక ఉచ్చు మాత్రమే అని తెలిపారు.
ఏది ఏమైనా... ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలోని ఈ యుద్ధం ముగియదని.. ఇరాన్ ప్రభుత్వ పతనంతోనే అది ముగుస్తుందని స్థానిక పౌరులు చెబుతుండటం గమనార్హం! దీంతో... ఇరాన్ పాలకుల చేతిలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు!
