Begin typing your search above and press return to search.

బాలిస్టిక్ క్షిపణుల గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసా?

అవును... ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఇరాన్ రెండు బారేజీలలో ఇజ్రాయెల్‌ పై సుమారు 150 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని మీడియా వెల్లడించింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:04 AM IST
బాలిస్టిక్  క్షిపణుల గురించి ఈ ఇంట్రస్టింగ్  విషయాలు తెలుసా?
X

ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్"ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిదాడిగా వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. వాస్తవానికి ఇజ్రాయెల్ వద్దనున్నంత అప్ డేటెడ్ యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద లేకపోయినా.. బలమైన క్షిపణులే ఉన్నాయని అంటారు. ఇందులో కీలకమైనవి బాలిస్టిక్ క్షిపణులు.

అవును... ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఇరాన్ రెండు బారేజీలలో ఇజ్రాయెల్‌ పై సుమారు 150 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని మీడియా వెల్లడించింది. ఇందులో భాగంగా... 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హత్యకు గురైన మాజీ జనరల్ ఖాసిం సోలైమాని పేరు మీద కొత్తగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణిని కూడా ఇరాన్ ఉపయోగించింది.

వాస్తవానికి బాలిస్టిక్ క్షిపణులు అనేవి బాలిస్టిక్ పథాన్ని అనుసరించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్‌ హెడ్‌ లను ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి చేరవేసేవి. అవి విమాన ప్రయాణపు ప్రారంభ దశలో శక్తినిచ్చి మార్గనిర్దేశం చేస్తాయి. తరువాత వాటి ప్రయాణంలో ఎక్కువ భాగం గురుత్వాకర్షణ ప్రభావంతో స్వేచ్ఛగా పడిపోయే మార్గాన్ని అనుసరిస్తాయి.

బాలిస్టిక్ క్షిపణి రకాలు:

యుద్ధభూమి శ్రేణి బాలిస్టిక్ క్షిపణి - 200 కి.మీ. కంటే తక్కువ

స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి - < 1,000 కి.మీ.

మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి - 1,000 - 3,000 కి.మీ.

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి - 3,000 - 5,500 కి.మీ.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి - > 5,500 కి.మీ.

ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయాణం మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో మొదటిది బూస్ట్ దశ. ఈ దశలో భాగంగా... క్షిపణిని శక్తివంతమైన రాకెట్ ఇంజిన్‌ లను ఉపయోగించి ప్రయోగిస్తారు. ఇంజిన్ మండుతున్నప్పుడు క్షిపణిని నడిపిస్తారు. ఇది వేగంగా పైకి వెళ్తుంది.. అనంతరం అంతరిక్ష అంచుకు చేరుకుంటుంది. ఈ దశ కొన్ని నిమిషాలు ఉంటుంది.

ఇక రెండో దశ.. మిడ్ కోర్స్ దశ. ఇంజిన్ ఆగిపోయిన తర్వాత క్షిపణి అంతరిక్షంలో తీరం దాటుతుంది. ఇది గాల్లోకి విసిరిన బంతిలాగా వక్ర మార్గాన్ని అనుసరిస్తుంది. ఇది అత్యంత పొడవైన దశ.. ఇది సుమారు 20 నిమిషాల వరకూ ఉంటుంది. ఆ తర్వాతది చివరి దశ. ఈ దశలో క్షిపణి తిరిగి వార్ హెడ్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

ఈ నేపథ్యంలో భూ గురుత్వాకర్షణ వాటిని తీవ్ర వేగంతో కిందకు లాగుతుంది. ఆ సమయంలో క్షిపణికి ప్రత్యేకంగా శక్తి అంటూ ఏమీ ఉండదు.. నిమిషం కంటే తక్కువ సమయంలో కింద పడిపోతుంది. ఈ విధంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం మూడు దశల్లో ఉంటుంది. ఈ బాలిస్టిక్ క్షిపణి.. సంప్రదాయ లేదా అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలవు.

ఇక బాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని మాక్ లలో కొలుస్తారు. ఇది ధ్వని వేగానికి సమానం. వీటిలో తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఒక మాక్ లేదా గంటకు 1225 కి.మీ. వేగంతో వెళ్తే... అధిక శ్రేణి క్షిపణులు, హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే.. మాక్ 5 లేదా గంటకు 6,125 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి.

ఈ సందర్భంగా... ఇరాన్ నుంచి ప్రయోగించబడిన క్షిపణి ఇజ్రాయెల్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడు చూద్దామ్..!

ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కు ప్రయోగించబడిన బాలిస్టిక్ క్షిపణి సుమారు 12 నిమిషాలకు చేరుకుంటుంది. ఇవి అధిక వేగం, ఆర్సింగ్ పథాన్ని అనుసరిస్తాయి. ఇరాన్ కలిగి ఉన్న శక్తివంతమైన డెలివరీ వ్యవస్థలలో ఇది ఒకటి!

ఇక క్రూయిజ్ క్షిపణుల విషయానికొస్తే... ఇవి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ చేరడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇవి సబ్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి భూమి పై నుంచే కాకుండా విమానాల నుంచి ప్రయొగించబడతాయి. ఇక డ్రోన్ల విషయానికొస్తే.. ఇవి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ చేరుకోవడానికి సుమారు 9 గంటల సమయం పడుతోంది.

కాగా... ఇరాన్‌ వద్ద ఉన్న క్షిపణుల్లో 2,000 కిలోమీటర్లకు పైబడి రేంజి ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్‌ లోని లక్ష్యాలను చేరుకోగలవని చెబుతున్నారు.