యుద్ధ విమానాల్లో 'మెగా' స్టార్... ఈ బాంబర్ గురించి తెలుసా?
అవును... అమెరికా బాంబర్ విమానం 'బి-2 స్పిరిట్' గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 24 Jun 2025 10:26 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత.. టెహ్రాన్ లోని ఫోర్డో అణుకేంద్రం గురించిన చర్చ విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది భూ ఉపరితలానికి సుమారు వంద మీటర్లకు పైగా లోతులో, అత్యంత కట్టుదిట్టంగా చేయబడిన నిర్మాణమని కథనాలొచ్చాయి. దీన్ని ధ్వంసం చేయాలంటే అందుకు తగిన ఆయుధం బంకర్ బ్లస్టర్ బాంబు అని.. అది అమెరికా వద్ద మాత్రమే ఉందనే చర్చ నడిచింది.
అన్నట్లుగానే ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా సుమారు 14 బంకర్ బ్లస్టర్ బాంబులను ఇరాన్ లోని అణుకేంద్రాలపై జారవిడిచింది. దీంతో.. అవన్నీ ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇంత భారీ బాంబులను మోసుకొచ్చి, సరిగ్గా దాడి చేసిన బాంబర్ విమానం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అదే 'బీ-2 స్పిరిట్ బాంబర్' విమానం.
అవును... అమెరికా బాంబర్ విమానం 'బి-2 స్పిరిట్' గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా సుదీర్ఘ దూరాల్లో కఠినమైన ఆపరేషన్లు చేయాలనుకొన్నప్పుడల్లా ఈ విమానాన్ని రంగంలోకి దించుతుంది. ఇది కొన్ని రోజుల పాటు సుదీర్ఘ సమయం గాల్లో ప్రయాణించి.. విజయవంతంగా పని పూర్తి చేసి తిరిగి రాగలదు. దీన్ని ఐదోతరం బాంబర్ గా పరిగణిస్తారు.
అగ్రరాజ్యం చేపట్టిన ఏ ఆపరేషన్ లో అయినా మొదటి రోజు రాత్రి ప్రత్యర్థి గగనతలంలోకి వెళ్లి సందడి చేసేది ఈ విమానమే. ఇందులో భాగంగా... అఫ్గానిస్థాన్ పై చేపట్టిన 'ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం' అయినా.. సెర్బియాపై ప్రారంబించిన 'ఆపరేషన్ అలైడ్ ఫోర్సెస్' అయినా.. ఇరాక్ పై విరుచుకుపడిన 'ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్' అయినా ఇదే సపోర్టింగ్ ఆపరేషన్లు చేసింది.
ఇదే క్రమంలో... లిబియాపై చేపట్టిన 'ఆపరేషన్ ఒడెస్సీ డాన్' అయినా.. తాజాగా ఇరాన్ పై చేపట్టిన 'ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్' అయినా.. వాటి విజయాలు దీనిపనే. ప్రపంచంలో ఏ యుద్ధ రంగంలోనైనా అన్నిరకాల పరిస్థితులను తట్టుకొని నిలిచిన బాంబర్ విమానంగా దీనికి పేరుంది.
ఇదే సమయంలో... కొసావోలో అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ అలైడ్ ఫోర్స్' కోసం తొలిరోజు రాత్రి అమెరికాలోని మిస్సోరి సమీపంలో ఉన్న వైట్ మన్ ఎయిర్ బేస్ నుంచి రెండు బి-2 స్పిరిట్ లు బయలుదేరి ఏకంగా 31 గంటలు ఏకధాటిగా ప్రయాణించాయి. అనంతరం కొసావో చేరుకొని.. దాడులు చేశాయి. దీంతో... దీని సామర్థ్యం చూసి ప్రపంచం నివ్వెరపోయింది.
అనంతరం... 2001లో ది స్పిరిట్ ఆఫ్ అమెరికా కోసం ఐదు బి-2 బాంబర్లు కలిసి అఫ్గానిస్థాన్ గగనతలంలోకి చొరబడి బాంబుదాడులు చేశాయి. దీనికోసం 44 గంటలు ప్రయాణించాయి. తాజాగా ఇరాన్ పైన చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం ఏడు బీ-2 బాంబర్లు 34 గంటలు ప్రయాణించాయి. మార్గమధ్యలో గాల్లోనే ఇంధనం నింపుకుంటూ అవిరామంగా ప్రయాణించి పని పూర్తి చేశాయి! అందుకే దీన్ని యుద్ధ విమానాల్లో మెగా స్టార్ అనొచ్చని అంటున్నారు!
