అమెరికా దాడులపై ఖమేనీ ఫస్ట్ రియాక్షన్... 21 + 2 + భారత్ పరిస్థితి?
అవును... ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉదృతంగా మారాయని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 12:43 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల క్షిపణులు, డ్రోన్లతో టెల్ అవీవ్, టెహ్రాన్ లు మండిపోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో... టెహ్రాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసింది. దీంతో.. వాతావరణం మరింత వేడెక్కింది. ఈ సమయంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పందించారు.
అవును... ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉదృతంగా మారాయని అంటున్నారు. ఈ సమయంలో అమెరికా దాడుల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఈ దాడులను ఖండించారు. దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.
ఇలా ఇరాన్ లోని అణుకేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఫస్ట్ టైమ్ 'ఎక్స్' వేదికగా స్పందించిన అయతుల్లా అలీ ఖమేనీ... జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడని.. పెద్ద నేరం చేశాడని.. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుందని తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని, శిక్ష కొనసాగుతోందని అన్నారు.
ఈ సమయంలో... ఇరాన్ కు మద్దతుగా తాము రంగంలోకి దిగుతున్నామని యెమెన్ ప్రకటించింది. ఇందులో భాగంగా... "యెమెన్ అధికారికంగా యుద్ధక్షేత్రంలోకి దిగుతోంది. మా ప్రాదేశిక జలాల నుంచి మీ నౌకలను దూరంగా ఉంచండి" అని యెమెన్ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్య సరీ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు.
ఇదే సమయంలో... ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ.. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, అణ్వాయుధ నిరాయుధీకరణ, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడం కోసం పిలుపునిస్తూ 21 ముస్లిం, అరబ్ దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. తాజాగా అమెరికా ఎంట్రీ తర్వాత ఈ దేశాల నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.
ఇందులో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కియే, సూడాన్, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, గాంబియా, అల్జీరియా, బ్రూనై, చాడ్, కొమొరోస్, జిబౌటి, సోమాలియా, ఇరాక్, లిబియా, ఒమన్, ఖతార్, ఈజిప్ట్, మౌరిటానియా దేశాలు ఉన్నాయి. అయితే... వీటిలో చాలా దేశాలకు ఈ యుద్ధం విస్తరించడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.
ఈ సమయలో మరో రెండు దేశాల నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటింది’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ దాడులను రష్యా విమర్శించినప్పటికీ ఇరాన్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు!
కట్ చేస్తే... ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం రష్యా దూకుడు పెంచింది. అమెరికా దాడులను తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో... ఇరాన్ కు అణ్వాయుధాలే కావాలంటే వాటిని సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక ప్రధానంగా భారత్ విషయానికొస్తే పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ తో భారత్ కు మంచి సంబంధలే ఉన్నాయి. ఇందులో భాగంగా.. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్ కు ఇరాన్ బలమైన భాగస్వామిగా ఉంది. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలున్నాయి.
ఇదే సమయంలో... ఇజ్రాయెల్ విషయానికిస్తే, ఈ దేశంతో భారత్ బంధం ప్రతేయకమైందని అంటారు. నెల రోజుల క్రితం భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు.. ఢిల్లీకి ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో... రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ న్యూట్రల్ గా ఉండొచ్చని అంటున్నారు.
ఏది ఏమైనా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీతో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయని అంటున్నారు. మరి ఈ పరిస్థితులు ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది వేచి చూడాలి!
