ఇ....ఇ.. మధ్య మన ఇ ఎటు? దాడులను ఖండించాలంటున్న పర్షియన్ దేశం
ఇక ఇజ్రాయెల్... కొన్ని దశాబ్దాల నుంచి భారత్ కు దగ్గరైంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్ కు ఇజ్రాయెల్ మద్దతు ప్రకటిస్తుంటుంది.
By: Tupaki Desk | 21 Jun 2025 12:45 PM ISTప్రపంచం ముంగిట ఇప్పుడున్న ప్రధాన ముప్పు ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ.. ఇది తీవ్రస్థాయి ఘర్షణగా మారి... మరో దీర్ఘకాల యుద్ధానికీ దారితీస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం పెను సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే ఇక పరిస్థితులు చెప్పనలవి కానంత తీవ్రంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ వివాదంలో ఇండియా ఎటు..?
ఒకప్పుడు పర్షియాగా పేరుగాంచిన ఇరాన్ తో భారత్ కు చారిత్రకంగా సుదీర్ఘ కాలంగా సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ కు శత్రువైన ఇరాన్ మనకు మిత్రుడు. ఇరు దేశాల మధ్య చమురు పైప్ లైన్ వేసుకునేంత స్థాయిలో బలమైన బంధం ఉంది. దౌత్యపరంగా భారత్ కు పలు సందర్భాల్లో ఇరాన్ మద్దతుగానూ నిలిచింది.
ఇక ఇజ్రాయెల్... కొన్ని దశాబ్దాల నుంచి భారత్ కు దగ్గరైంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్ కు ఇజ్రాయెల్ మద్దతు ప్రకటిస్తుంటుంది. మిలిటెంట్ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇజ్రాయెల్.. ఉగ్రవాదం బారిన పడిన భారత్ కు సంఘీభావం తెలుపుతూ ఉంటుంది. ఇరు దేశాల మధ్య టెక్నాలజీ మార్పిడి కూడా జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ (ఇ...ఇ..) నేరుగా యుద్ధానికి దిగాయి. మరి ఈ సందర్భంలో భారత్ ఎవరి పక్షం వహించాలి..? ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి. అటు చూస్తే ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలి అని కోరుతున్నారు ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్న సంగతిని ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని.. అందుకని భారత్ తమకు మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రతి దేశం ఇదే పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్లోబల్ సౌత్ (డెవలపింగ్, పేద దేశాలు)కు భారత్ నాయకుడు అని.. కాబట్టి ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకించాలని సూచించారు. గ్లోబల్ సౌత్ లో భాగమైన ఇరాన్ నష్టపోతే ఆ ప్రభావం మిగతా దేశాలపైనా ఉంటుందని వివరించారు.
