మన రూపాయిపై 'ఇరాన్' దెబ్బ..ఏం జరుగుతోంది?
ప్రస్తుతం తీవ్రస్తాయికి చేరిన ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ముక్కోణపు యుద్ధం ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడనుందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది.
By: Tupaki Desk | 23 Jun 2025 9:04 AM ISTప్రస్తుతం తీవ్రస్తాయికి చేరిన ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ముక్కోణపు యుద్ధం ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడనుందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పుడిప్పుడే..దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది. దీంతో ఆర్బీఐ తన రెపో రేటును కొంత మేరకు సవరిస్తూ.. ప్రజలకు ఉపశమనం కల్పిస్తోంది. గృహ, బంగారు రుణాలపై వడ్డీ రేట్లు గత నాలుగు మాసాల్లో 2 రూపాయల చొప్పున తగ్గాయి. దీంతో ప్రజలు కొంత భారాల నుంచి బయట పడుతున్నారు. మరోవైపు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు గత రెండు సంత్సరాల నుంచి నిలకడగానే ఉన్నాయి.
ఇది కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎంతో సహాయకారిగా ఉంది. రెండేళ్లు చమురు ధరల్లో ఎలాంటి మార్పూ లేక పోవడంతో నిత్యావసరాల ధరలు కొంత మేరకు ఒడిదుడుకులకు లోనవుతున్నా.. ప్రజలు భరించలేని పరిస్థితికి అయితే చేరుకో లేదు. ఇటీవలే ఈ పరిణామాలపై ఆర్బీఐ కూడా సంతోషం వ్యక్తం చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం నిలకడగానే ఉందని.. అందుకే రెపో(బ్యాంకులు వసూలు చేసే వడ్డీ)ని తగ్గించామని చెప్పుకొచ్చింది. అయితే.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా.. దేశం తీవ్ర కుదుపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయెల్ సహా అమెరికాలు.. ఇరాన్‌పై దాడులు చేయడం.. కీలకమైన అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు..ముఖ్యంగా భారత్‌కు కీలకమైన `హర్మూజ్` జల సంధి(ఈ మార్గం ద్వారానే నౌకలు ప్రయాణం చేస్తాయి)ని ఇరాన్ పార్లమెంటు మూసేసింది. దీనిని తక్షణం అమలు చేసింది. ఫలితంగా ఈ మార్గం ద్వారా భారత దేశానికి చేరుకునే చమురు నౌకలకు మరో మార్గం లేదు. ఫలితంగా దేశంలో చమురు ప్రజల అవసరాలకు తగినంత సమకూరే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశం 90 శాతం పెట్రోలు, డీజిల్ వంటివాటిని ముడి పదార్ధాలుగా ఇరాన్ సహా దుబాయిల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఈ దిగుమతి చేసుకునే చమురు హర్మూజ్ జలసంధి ద్వారానే గుజరాత్‌లోని బాంద్రా నౌకాశ్రయానికి చేరుకుంటాయి. ఇప్పుడు ఇరాన్ దీనిని నిలిపివేసిన సమయంలో.. ఇతర మార్గాలు మనకు లేవు. దీంతో నిత్యం వినియోగించే చమురులో 40 శాతం మేరకు, నెల వారీ వినియోగంలో 70 శాతం కోతకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇదే జరిగితే.. చమురుకు డిమాండ్ అమాంతంగా పెరిగి.. ధరలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. దీంతో అన్ని నిత్యావసరాల ధరలతోపాటు రెపోరేటును కూడా పెంచక తప్పదు. ఫలితంగా మరోసారి ప్రజలపై ఆర్థిక భారం.. తప్పదని అంటున్నారు. ఇదేసమయంలో భారత రూపాయిపైనా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 87 రూపాయలుగా ఉన్న కరెన్సీ, రూ.100కు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
