Begin typing your search above and press return to search.

హౌతీల ముప్పు.. మరో జలసంధి క్లోజ్!!

ఒకవేళ హౌతీలు ఈ మార్గాన్ని మూసివేస్తే, నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   15 March 2026 1:54 PM IST
హౌతీల ముప్పు.. మరో జలసంధి క్లోజ్!!
X

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గడంలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే పరిస్థితి భయపెడుతోంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా అస్తవ్యస్తమైంది. ఇలాంటి సమయంలో బాబ్ ఎల్ - మండేబ్ జల సంధిని మూసివేస్తామని ఇరాన్ మద్దతుదారులైన హౌతీ తీవ్రవాదులు హెచ్చరించడం ఆందోళనకరంగా మారింది. ఆఫ్రికా ఖండానికి అరేబియా ద్వీపకల్పానికి మధ్య ఉన్న బాబ్ ఎల్ - మండేబ్ జల సంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకం. ఈ జల సంధిపై హౌతీ తిరుగుబాటుదారులు ఫోకస్ చేయడం గ్లోబల్ ట్రేడ్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

ప్రపంచ వాణిజ్యంలో బాబ్ ఎల్ - మండేబ్ జల సంధి ఒక "చోక్ పాయింట్" గా చెబుతారు. అంటే, ఇక్కడ రవాణా ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆసియా నుండి యూరప్‌కు వెళ్లే నౌకలు సూయజ్ కాలువను చేరుకోవాలంటే తప్పనిసరిగా బాబ్ ఎల్-మండేబ్ దాటాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వాణిజ్యంలో సుమారు 10 నుంచి 12 శాతం వరకు ఈ చిన్న జలసంధి గుండానే జరుగుతుంది. ఏటా వేల సంఖ్యలో వాణిజ్య నౌకలు దీని గుండా ప్రయాణిస్తాయి.

ముడి చమురు, సహజ వాయువు రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. పర్షియన్ గల్ఫ్ దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుండి యూరప్, అమెరికాకు వెళ్లే చమురు ట్యాంకర్లు ఈ మార్గం ద్వారానే వెళ్తాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఈ జలసంధికి సమీపంలోనే ఉంటారు. వారు క్షిపణులు లేదా డ్రోన్లతో నౌకలపై దాడులు చేస్తే ఈ జలసంధి మూతపడే అవకాశం ఉందనే సమాచారం ప్రపంచాన్ని భయపెడుతోంది. అయితే ప్రస్తుతం అమెరికా ఈ జలసంధిపై పూర్తి నిఘా ఉంచింది.

ఒకవేళ హౌతీలు ఈ మార్గాన్ని మూసివేస్తే, నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ దూరం పెరిగిపోనుంది. సుమారు 6,000 నుంచి 9,000 కిలోమీటర్లు దూరం పెరగడం వల్ల ఖర్చులు మోయలేని భారంగా మారుతాయని అంటున్నారు. అంతేకాకుండా చమురు సరఫరా ఆలస్యమై ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అదేవిధంగా షిప్పింగ్ ఛార్జీలు పెరుగుతాయని చెబుతున్నారు. బీమా ఖర్చులు, రవాణా ఖర్చులు పెరిగి వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు.

హోర్ముజ్ తోపాటు బాబ్ ఎల్ - మండేబ్ జలసంధి మూతపడితే ప్రపంచం ఊహించని ఆర్ధిక విలయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు జలసంధులు మూతపడితే ముడిచమురు రవాణా దాదాపు మూతపడినట్లుగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో బాబ్ ఎల్ మండేబ్ మూతపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ రెండు జలసంధులు మూతపడితే దేశంలో ఊహించని ఆర్థిక విలయం రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు వచ్చే చమురులో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, రష్యా (కొంత భాగం) నుంచి వస్తుంది. ఇవన్నీ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్-మండేబ్ మీదుగానే రావాలి. ఈ మార్గాలు మూతపడితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయికి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.