Begin typing your search above and press return to search.

అటు అమెరికా.. ఇటు రష్యా.. మళ్లీ తెరమీదకు మూడో ప్రపంచ యుద్ధం?

సరిగ్గా 20 నెలల కిందట ఇజ్రాయెల్ –హమాస్ మధ్య యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు సాగించిన మారణకాండతో ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలుపెట్టింది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 10:00 PM IST
అటు అమెరికా.. ఇటు రష్యా.. మళ్లీ తెరమీదకు మూడో ప్రపంచ యుద్ధం?
X

సరిగ్గా మూడేళ్ల కిందట మొదలైంది మూడో ప్రపంచ యుద్ధం మాట. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగడంతో ప్రపంచం అంతా భయం నెలకొంది. కారణం.. ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దేశాలు అన్నీ అండగా నిలవడం. అయితే, చివరకు మూడో ప్రపంచ యుద్ధం రాలేదు. ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. రష్యాకూ గట్టి దెబ్బలు తగిలాయి. ఇప్పటికీ ఈ రెండు దేశాలు యుద్ధంలోనే ఉన్నాయి. వందలకొద్దీ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. మిస్సైళ్లు వేసుకుంటున్నాయి.

సరిగ్గా 20 నెలల కిందట ఇజ్రాయెల్ –హమాస్ మధ్య యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు సాగించిన మారణకాండతో ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలుపెట్టింది. హమాస్ ల అడ్డా గాజాపై తీవ్రంగా దాడులు చేస్తోంది. మిలిటెంట్ సంస్థను సమూలంగా నిర్మూలిస్తాం అన్న మాటను నిలుపుకొంటాం అని అంటోంది. అయితే, హమాస్ లకు హూతీలు, హెజ్బొల్లాలతో పాటు ఇరాన్, లెబనాన్ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం విస్తరించింది. ఇరాన్ పై ఇప్పటికే గత ఏడాది దాడి చేసిన ఇజ్రాయెల్ మరోసారి ’అణు’ బూచి చూపుతూ దాడులు చేస్తోంది.

ఈ రెండు యుద్ధాల సందర్భాల్లోనూ మూడో ప్రపంచ యుద్ధం మాట తరచూ వినిపించింది. అటు.. ఉక్రెయిన్ కు, ఇటు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉండడం.. ఇటు ఇరాన్ కు రష్యా అండ ఉండడం. అయితే, మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచుకు వెళ్లినా మళ్లీ ఉద్రిక్తతలు తగ్గాయి. ఇప్పుడు మాత్రం మళ్లీ వినిపిస్తున్నాయి.

ఇరాన్ అణు కార్యక్రమాల పట్ల దాని శత్రుదేశమైన అమెరికాకు ఎప్పటినుంచో మంట. సహజంగానే హమాస్ లను సమర్థించే ఇజ్రాయెల్ కూ అదే అభిప్రాయం ఉంటుంది. దీంతో ఇరాన్ అణు వార్ హెడ్ ల డెవలప్ మెంట్ ను ఆపడానికే తాము దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. మొన్నటివరకు ఇరాన్ తో చర్చలు సాగించిన అమెరికా అవి విఫలం కావడంతో హూంకరిస్తోంది. ఇజ్రాయెల్ దాడులను గట్టిగా సమర్థిస్తోంది. అయితే, రష్యా మద్దతు ఉన్న ఇరాన్ ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఇప్పటికే డ్రోన్లను సరఫరా చేసింది ఇరాన్. అంటే.. ఇప్పుడు ఇరాన్ విషయంలో మద్దతుగా రావడానికి రష్యా సిద్ధంగా ఉంటుంది.

ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులను చూస్తే.. ఇక ఆపడం కష్టమేనని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఈ రెండు దేశాలు చాలా దూరం వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో.. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అసలు మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే.. అది పెద్ద విపత్తే.