కాల్పుల విరమణ వేళ ఇరాన్ మాటలు, చేతలు మామూలుగా లేవుగా?
మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 11:10 AM ISTగత కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అంటూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుందని తెలిపారు. ఇదే సమయంలో.. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు టెహ్రాన్ నుంచి భిన్నమైన ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా.. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదని పేర్కొన్న ఇరాన్.. ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రెండు విభిన్న పోస్టులు చేశారు. అయితే.. ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.
మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా... మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్ లక్ష్యంగా టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించిందని.. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకొని దడులు చేసిందని ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇదే సమయంలో... ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు చనిపోయినట్లు ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటల తర్వాత కూడా దాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఐడీఎఫ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది! ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి స్పందించారు.
ఇందులో భాగంగా.. నేటి తెల్లవారుజామున ఇజ్రాయెల్ - ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పిన ట్రంప్... ఇప్పటినుంచి సుమారు ఆరు గంటల తర్వాత ఇరు దేశాలు పరస్పరం తుదివిడత దాడులు పూర్తి చేసుకొని గాయపడిన తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ తర్వాత 12వ గంట నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మొదలుపెడుతుంందని.. ఈ విధంగా 24 గంటల తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా, గౌరవ ప్రదంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ట్రంప్ మాటలు ఇలా ఉంటే ఇరాన్ వ్యవహారం మరోలా ఉందని అంటున్నారు.
ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కాల్పుల విరమణ పాటిస్తామని చెబుతోంది. ట్రంప్ ప్రకటించిన 6 గంటల గడువు ముగిసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ పై మరిన్ని క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో... ఇరాన్ ఉద్దేశ్యం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
తాజాగా ఈ విషయంపై స్పందించిన ఇరాన్... ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చే ముందు చివరిసారిగా ఆ దేశంపై మిసైల్ అటాక్ చేసినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్.. తాజాగా (చివరిగా) ఇరాన్ తమపై ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది.
దీంతో... చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని ఇరాన్ భావించినట్లుందని అంటున్నారు నెటిజన్లు. ఆ సంగతి అలా ఉంటే... ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం టెహ్రాన్ ను ట్రంప్ ప్రాధేయపడ్డారని.. ఖతార్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే.. ఇజ్రాయెల్ తో బలవంతంగా కాల్పుల విరమణ అంగీకరింపజేశారని ఇరాన్ మీడియా చెప్పడం గమనార్హం.
