ఎవరీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్..? వీరెందుకు పవర్ ఫుల్..?
ఇరాన్ లో 1979లో రాజుకు వ్యతిరేకంగా విప్లవం వచ్చింది. అప్పటివరకు యూరోపియన్ కల్చర్ ప్రభావంలో ఉన్న ఇరాన్ అనంతరం మత రాజ్యంగా ఆవిర్భవించింది.
By: Tupaki Desk | 13 Jun 2025 9:00 PM ISTప్రతిదేశానికి సైన్యం ఉంటుంది.. ఇరాన్ కూ అలానే ఉంది.. కానీ, సూపర్ సైన్యం కూడా ఉంది.. దాని పేరు ఐఆర్ జీసీ (ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్). ఇది ఎంత శక్తిమంతమైనది అంటే.. ఆ దేశ అధ్యక్షుడికి కాదు.. నేరుగా సుప్రీం లీడర్ (అయతొల్లా అలీ ఖమేనీ)కి మాత్రమే జవాబుదారీ. దేశంలో అంతర్గత భద్రతను పర్యవేక్షిస్తుంది ఈ ఐఆర్ జీసీ. తాజాగా దీని చీఫ్ ను చంపేసింది ఇజ్రాయెల్. అంటే.. ఇరాన్ తో నేరుగా భీకర యుద్ధానికి సిద్ధం అయిందన్నమాట.
అసలు ఎవరీ ఐఆర్ జీసీ..? ఇరాన్ లో రాజకీయ, సైనిక వ్యవస్థ కీలక విభాగమే ఇది. అయితే, దీనికి సొంత పారా మిలటరీ, నౌకా దళం, వైమానిక దళం, నిఘా వ్యవస్థలు ఉండడం గమనార్హం. ఐఆర్ జీసీకి ఏకంగా విదేశీ దళం కూడా ఉంది. దాని పేరు ఖుద్స్ ఫోర్స్.
ఇరాన్ లో 1979లో రాజుకు వ్యతిరేకంగా విప్లవం వచ్చింది. అప్పటివరకు యూరోపియన్ కల్చర్ ప్రభావంలో ఉన్న ఇరాన్ అనంతరం మత రాజ్యంగా ఆవిర్భవించింది. అదే సమయంలో రుహొల్లా ఖొమేనీ.. ఐఆర్ జీసీని స్థాపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సైద్ధాంతిక సైన్యం.
ఎందుకంటే.. ఇరాన్ సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతుంది. ఐఆర్ జీసీ మాత్రం ఆ దేశ ఇస్లామిక్ రిపబ్లిక్ సమగ్రతను కాపాడుతుంది. విదేశీ జోక్యం నివారణ, సంప్రదాయ సైన్యం తిరుగుబాట్లను అడ్డుకోవడం, సైద్ధాంతిక పాలనపై ఉద్యమాలను అడ్డుకోవడం వంటివాటిని చూసుకుంటుంది.
నిరుటి వరకు ఐఆర్ జీసీలో 1.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. దీని నౌకా దళం.. కీలకమైన పర్షియన్ గల్ఫ్ ను నియంత్రిస్తూ ఉంటుంది. ఐఆర్ జీసీకి బాసిజ్ అనేది పారామిలటరీ మిలీషియా. దీంట్లోనే 90 వేల మంది సభ్యులున్నారు. రెండున్నరేళ్ల కిందట హిజాబ్ కు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలను బాసిజ్ కర్కశంగా అణచివేసింది. ఐఆర్ జీసీకి సెఫా న్యూస్ అనే మీడియా కూడా ఉంది.
ఐఆర్ జీసీని గల్ఫ్ లోని బహ్రెయిన్, సౌదీ అరేబియాతో పాటు అమెరికా, కెనడా, పరాగ్వే, స్వీడన్ లు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
