Begin typing your search above and press return to search.

హర్ముజ్‌లో ‘డేటా టోల్‌గేట్’..!

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తుంటే ఇప్పుడు ఇరాన్ మరో అల్ట్రా-మోడ్రన్ స్టార్ట్‌అప్ ఐడియా తో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు ప్యాంట్ తడిచేలా చేస్తోంది.

By:  A.N.Kumar   |   18 May 2026 6:37 PM IST
హర్ముజ్‌లో ‘డేటా టోల్‌గేట్’..!
X

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తుంటే ఇప్పుడు ఇరాన్ మరో అల్ట్రా-మోడ్రన్ స్టార్ట్‌అప్ ఐడియా తో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు ప్యాంట్ తడిచేలా చేస్తోంది. ప్రపంచ సరఫరా దారుల్లో అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’ గుండా వెళ్లే చమురు ట్యాంకర్లకు టోల్ ట్యాక్స్‌లు వేయడం.. బెదిరించడం పాత చింతకాయ పచ్చడి కథ అయిపోయిందని ఇరాన్ భావించినట్టుంది. అందుకే రూటు మార్చి ఈసారి నేరుగా ప్రపంచానికి ఊపిరిగా మారిన ‘ఇంటర్నెట్‌కే టోల్ గేట్’ వేయాలన్న సరికొత్త మాస్టర్ ప్లాన్‌తో టెహ్రాన్ రంగంలోకి దిగింది.

సముద్ర గర్భంలో మైళ్ల కొద్దీ పరుచుకున్న అండర్‌సీ డేటా కేబుల్స్ పై ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ గట్టిగా ఆలోచిస్తోందన్న వార్తలు ఇప్పుడు గ్లోబల్ ఐటీ కారిడార్లలో భూకంపం సృష్టిస్తున్నాయి. ప్రపంచమంతా సోఫాలో పడుకుని “ఇన్‌స్టాగ్రామ్ రీల్స్” చూస్తూ “ట్విట్టర్ మీమ్స్” షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటే.. ఆ డేటా అంతా ప్రవహించే అసలు సిసలైన వైర్లు తమ సముద్రం కింద నుంచే వెళ్తున్నాయని ఇరాన్ ఆలస్యంగా గుర్తించింది. అంతే.. వెంటనే గల్లా పెట్టె తెరిచి “అన్నా… వైర్లు మావయ్యా.. కాస్త టోల్ కట్టి వెళ్లండయ్యా!’’ అంటూ సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది.

టెక్ దిగ్గజాలకు ‘ఇరాన్’ మార్క్ మెసేజ్‌లు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సిలికాన్ వ్యాలీ సామ్రాజ్యాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ జెయింట్స్‌కు ఇరాన్ నుంచి ప్రత్యేకంగా ‘అంబాసిడర్ లెటర్స్’ వెళ్లాయట. ఆ లెటర్స్ సారాంశం సింపుల్‌గా.. కానీ స్ట్రాంగ్‌గా ఉందంటున్నారు.

"మీరు గనుక సకాలంలో ఈ డేటా టోల్ ఫీజులు చెల్లించకపోతే.. అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌లో చిన్న చిన్న ‘సాంకేతిక లోపాలు’ అదేనండీ.. కేబుల్ కట్స్, సిగ్నల్ బ్లాక్స్ రావచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం" అని ఇరాన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

దీనర్ధం ఏమిటంటే.. ఇకపై మీ ఇంట్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్ లోడింగ్ స్లోగా ఉన్నా యూట్యూబ్ బఫర్ అవుతున్నా.. దానికి మీ వైఫై కనెక్షన్ తప్పు కాదు.. జియో సమస్య అసలే కాదు.. నేరుగా మిడిల్ ఈస్ట్ లోని 'జియోపాలిటిక్స్' కారణమని సరిపెట్టుకోవాలన్నమాట!

'లోకల్ సర్వీస్ సెంటర్' కూడా మాదే!

ఇంతటితో ఆగితే అది ఇరాన్ ఎందుకవుతుంది? ఈ బిజినెస్ మోడల్‌లో మరో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చింది టెహ్రాన్. ఆ సముద్ర గర్భ కేబుళ్ల మరమ్మత్తులు.. వార్షిక మెయింటెనెన్స్ హక్కులు కూడా కేవలం ఇరాన్ స్థానిక కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. అంటే.. అమెరికా, యూరప్ దేశాల డేటా లైన్లకు ఇప్పుడు “లోకల్ మెకానిక్ షాప్” కూడా టెహ్రాన్ నుంచే నడవాలన్నమాట. ఒకవేళ పొరపాటున వైర్ తెగితే.. ఇరాన్ పర్మిషన్ ఇచ్చి వాళ్ల మెకానిక్ వచ్చి రిపేర్ చేసేదాకా ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్లు పక్కనపెట్టి ప్రశాంతంగా తపస్సు చేసుకోవాల్సిందే.

సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం

ఈ విచిత్రమైన వార్త బయటకు రాగానే నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ఐడియాపై ఒక రేంజ్‌లో సెటైర్లు, మీమ్స్ పేలుస్తున్నారు. ఇప్పటివరకు హైవేల దగ్గర టోల్ గేట్ల కోసం ఫాస్టాగ్ ఉండేది… ఇకపై ఇంటర్నెట్ వాడకానికి కూడా మొబైల్‌లో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలా? అని కొందరు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఒకవేళ మేము వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆన్ చేసుకుంటే.. ఈ ఇరాన్ టోల్ గేట్ నంబర్ ప్లేట్ స్కానర్ల నుంచి తప్పించుకోవచ్చా బ్రదర్? అంటూ మరికొందరు అమాయకంగా ట్రోల్స్ చేస్తున్నారు. "గూగుల్ మ్యాప్స్ ఇకపై రోడ్లకే కాదు.. డేటా వైర్లకు కూడా 'టోల్స్ లేని ప్రత్యామ్నాయ రూట్' చూపించాలేమో!" అని ఐటీ ఉద్యోగులు జోకులు వేస్తున్నారు.

ట్రంప్ వర్సెస్ ఇరాన్.. వైఫై కోసం ప్రపంచ యుద్ధం?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు "ఆటలు సాగవు" అంటూ లాస్ట్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. ఈ సరికొత్త “డేటా టోల్ పాలసీ” అమెరికాకు అస్సలు మింగిడుపడటం లేదు. చమురు వ్యాపారాన్ని దెబ్బకొడితే.. ఇరాన్ ఇలా డేటాపై పడటం ప్రపంచాన్ని కొత్త ఉద్రిక్తతల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ఒకప్పుడు భూభాగాల కోసం.. ఆ తర్వాత చమురు బావుల కోసం యుద్ధాలు జరిగేవి.. కానీ ఈ లెక్కన చూస్తుంటే భవిష్యత్తులో కేవలం వైఫై సిగ్నల్స్ కోసం.. రీల్స్ అప్‌లోడ్ చేసుకోవడం కోసం ప్రపంచ దేశాలు క్షిపణులు వాడుకునే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.