ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్ కు 'హైపర్' సోనిక్ మిస్సైల్ తో రిప్లై పంపిన ఇరాన్!
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోమని వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి ఎక్స్ వేదికగా రిప్లై వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 3:35 PM ISTసోకాల్డ్ సుప్రీం లీడర్ (ఖమేనీ) ని చంపడం పెద్ద పనేమీ కాదని.. బేషరతుగా లొంగిపోవాలని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ నుంచి 'ఎక్స్' వేదికగానే కాకుండా.. వార్ ఫీల్డ్ లోనూ సమాధానం వచ్చేసింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై వ్యూహాత్మకంగా దాడి చేస్తోన్న ఇరాన్.. బుధవారం తెల్లవారుజామున రెచ్చిపోయింది. హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోమని వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి ఎక్స్ వేదికగా రిప్లై వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జాల్ఫికర్ తో కలిసి ఖైబర్ కు వచ్చేశారు" అని అందులో రాశారు. దీంతోపాటు ఖడ్గం చేతబట్టి కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జతచేశారు.
ఇలా "యుద్ధం మొదలైంది" అనే రిప్లై ను మాటల్లో ఇచ్చిన ఇరాన్... బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై చేతల్లోనూ సమాధానం ఇచ్చేసింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ ఓ ప్రకటనలో ధృవీకరించింది. దీంతో... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి.
ఇజ్రాయెల్ లోని 10 లక్ష్యాలపై ఫతాహ్-1 హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్... 'ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ - 3'లో 11వ దశ కొనసాగుతోందని వెల్లడించింది. ఇదే సమయంలో ఆక్రమిత భూభాగాల గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ప్రకటించింది. ట్రంప్ వార్నింగ్ అనంతరం "యుద్ధం మొదలైంది" అని ఖమేనీ ప్రకటించిన అనంతరం ఇరాన్ ఈ దాడి చేసింది.
దీంతో... ఇజ్రాయెల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా.. సెంట్రల్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరాల్లో అలర్ట్ జారీ చేసింది. మిస్సైళ్ల దాడి జరుగుతున్నందున ప్రజలు తక్షణమే ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది.
కాగా... ఇరాన్ వద్ద ఉండే అత్యంత పవర్ ఫుల్ ఆయుధాల్లో ఈ ఫతాహ్-1 హైపర్ సోనిక్ మిస్సైల్ ఒకటి. ధ్వని కంటే సుమారు 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈ క్షిపణి.. 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. అది కూడా 4 నిమిషాల్లోనే కావడం గమనార్హం!
