ఇరాన్ కీలక నిర్ణయం: 'ఇంటర్ నెట్' వ్యవస్థ భగ్నం?
ప్రపంచ దేశాలను కలిపి ఉంచుతున్న ఇంటర్ నెట్ కేబుళ్లు .. ఇరాన్ పరిధిలోని హోర్ముజ్ జల సంధి, హౌతీల అధీనంలోని ఎర్ర సముద్రంలో ఉన్న `బాబ్ అల్ మందేబ్` జలసంధిలో ఉన్నాయి.
By: Garuda Media | 28 March 2026 10:06 AM ISTదండలో దారం మాదిరిగా ప్రపంచాన్ని ఒకే వేదికపై నిలబెడుతున్న ఏకకై వ్యవస్థ.. ఇంటర్‌నెట్. ఒక దేశం నుంచి మరో దేశానికి డేటా కొనసాగుతుండడంతో.. అన్ని దేశాలు ఒకేవేదికపై పనులు చేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల నుంచి అనేక పనుల వరకు ఇప్పుడు ఇంటర్‌నెట్ కీలకంగా మారింది. ఒక్క గంట ఇంటర్‌నెట్ ఆగిపోతే.. ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు.. పాలన కూడా కుప్పకూలుతుంది. అంతేకాదు.. అనేక విధ్వంసాలకు కూడా దారితీస్తుంది. ఈ చిన్న వ్యవహారమే.. ఇప్పుడు ఇరాన్‌కు కలిసి వస్తోంది. ప్రపంచంపై దండెత్తేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తోంది.
అమెరికా దూకుడు పెంచితే..
తమపై అమెరికా మరింత దూకుడు పెంచితే.. ప్రపంచానికి సవాల్ రువ్వేలా వ్యవహరించాలని ఇరాన్ నిర్ణయించింది. దీనికి హౌతీల సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. హౌతీలు సైతం ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయిలో రగిలిపోతున్న దరిమిలా.. ఇరాన్‌కు కలిసివచ్చేందుకు అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో ఇరు పక్షాల మధ్య గత రెండు రోజులుగా అత్యంత రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అటు ఇరాన్, ఇటు హౌతీలు పట్టు బిగిస్తే.. ఇంటర్‌నెట్ కేబుల్ వ్యవస్థను నిలిపి వేయడం ఖాయమని అంచనాకు వచ్చాయి.
ఇప్పటికే ఇరాన్.. తన పరిధిలోని హోర్ముజ్ జలసంధిని నిలిపివేయడం(శత్రుదేశాలకు అంటున్నా.. దాదాపు అందరికీ)తో ఇంధ నం సహా గ్యాస్ సరఫరా ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలంగా మారింది. దీంతో నాటో దేశాలు సహా.. మరిన్ని దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచాయి. ఫలితంగానే ఐదు రోజుల విరామంతెరమీదికి వచ్చింది. అయితే.. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినా.. అమెరికా నుంచి తాము ఆశిస్తున్న విధంగా ఫలితాలు రావడం లేదని ఇరాన్ చెబుతోంది. ఈ క్రమంలో మరింత ఒత్తిడి పెంచేలా ప్రపంచ దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంటర్‌నెట్‌ను బంద్ చేయడమే ఇప్పుడు ఇరాన్ ఎంచుకున్న ఆయుధంగా భావిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
ప్రపంచ దేశాలను కలిపి ఉంచుతున్న ఇంటర్ నెట్ కేబుళ్లు .. ఇరాన్ పరిధిలోని హోర్ముజ్ జల సంధి, హౌతీల అధీనంలోని ఎర్ర సముద్రంలో ఉన్న `బాబ్ అల్ మందేబ్` జలసంధిలో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్‌కు సహకరించేందుకు హౌతీలు కూడా సిద్ధం కావడంతో ఈరెండు చోట్లా కేబుళ్లను తాత్కాలికంగా పనిచేయకుండా చేయాలన్నది వ్యూహం. ఇదే జరిగితే.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని నెట్ ఆధారితసేవలు నిలిచిపోతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం.
కేంద్రం అలెర్ట్..
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే డేటా కేబుళ్ల ద్వారా దాదాపు మూడింట ఒక వంతు హోర్ముజ్ జలసంధి గుండా సాగుతుంది. దీంతో కొంత ట్రాఫిక్‌ను వేర్వేరు ప్రాంతాల గుండా మళ్లించే విషయంపై ఉన్నతస్థాయి కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. సో.. ఏ క్షణమైనా నెట్‌కు ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు అందుతున్నాయి.
