హర్మూజ్ మూసేస్తే... కేంద్ర పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2025 11:01 AM ISTపశ్చిమాసియాలో గత 10 రోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, ఇరాన్ లు పోటాపోటీగా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించుకుంటున్నాయి. ఈ సమయంలో ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మరింత ఉదృతంగా మారిపోయింది. ఈ సమయంలో హార్మూజ్ విషయంలో ఇరాన్ నిర్ణయం సంచలనంగా మారింది.
ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్ కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసేలా ఇరాన్ పార్లమెంటు ఓ నిర్ణయానికి వచ్చింది. ఇక సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దే తుది నిర్ణయం అని చెబుతున్నారు.
ఈ సమయంలో.. ఒక వేళ హార్మూజ్ జలసంధిని మూసివేయడానికే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంటే ఆ తదనంతర పరిణాంలు ఎలా ఉండబోతున్నాయనే ఆందొళన ప్రపంచ దేశాలను వెంటాడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హార్మూజ్ ని మూసివేస్తే ఆ ప్రభావం భారత్ పై ఎలా ఉండబోతుందనేది మంత్రి హర్దీప్ సింగ్ వెళ్లడించారు.
అవును... హర్మూజ్ జలసంధిని ఒకవేళ ఇరాన్ మూసివేస్తే ఆ ప్రభావం భారత్ పై ఏ మేరకు పడుతుందనే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. ఇందులో భాగంగా... గత రెండు వారాలుగా పశ్చిమాసియాలోని పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.
ఇదే సమయంలో.. ప్రధాని మోడీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించామని.. దీంతో ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదని తెలిపారు. మన చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండటంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... మన పౌరులకు ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ భరోసా ఇచ్చారు! కాగా... భారత్ వద్ద 74 రోజులకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే!!
