'హార్మూజ్ ని మూసివేస్తాం'... ఇరాన్ నేవీకి అంత పవర్ ఉందా?
ఇరాన్ నేవీకి చెందిన ప్రధాన ఆయుధాలు ప్రధాన నౌకాదళం వద్దే ఉన్నాయి. ఇందులో భాగంగా... 100కుపైగా యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు ఉన్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 2:00 AM ISTఅవ్వడానికి ఇరుకైన జలసంధే... దాని వెడల్పు కేవలం 30 కిలోమీటర్లే.. అయినప్పటికీ అది ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడి. దీనివల్ల ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచం వాణిజ్యంపై పెను ప్రభావమే చూపిస్తుందని అంటారు. అలాంటి హార్మూజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించింది. ఇక సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దే తుది నిర్ణయం అని చెబుతున్నారు.
దీంతో.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ప్రధానంగా పలు అరబ్ దేశాలతో పాటు చైనాకూ పెద్ద సమస్య రాబోతోందని అంటున్నారు. తమపై అమెరికా దాడి అనంతరం ప్రపంచంలోని చాలా దేశాలపై ఏకకాలంలో ఒత్తిడి తెచ్చి ప్రయత్నంలో భాగంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. అందుకు ఇరాన్ శక్తి సరిపోతుందా అనేది ప్రశ్న!
అవును... హార్మూజ్ ని మూసివేస్తే చాలా దేశాలకు చమురు ఇబ్బందులు, దానితో వ్యాపారం చేసే వాటికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దీనికి ఇరాన్ ఏమీ అతీతం కాదు. అయినప్పటీకీ తాజా పరిస్థితుల్లో అక్కడి పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం అమలు అంత ఈజీ కాదు. ఈ క్రమంలో టెహ్రాన్ కు బలమైన నౌకాదళం ఉంటేగానీ అది సాధ్యం కాదు!
ఇరాన్ కు ప్రధాన నౌకాదళంతో పాటు రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐ.ఆర్.జీ.సీ)కి కూడా నేవీ విభాగం ఉంది. ఈ రెండు దళాలు సమన్వయంతో పనిచేస్తూ సముద్రంలో ఇరాన్ ప్రయోజనాలను కాపాడుతాయి. ఈ రెండు దళాలను కలిపితే పెద్ద సంఖ్యలో నౌకలు, సబ్ మెరైన్లు దాని అమ్ముల పొదిలో ఉన్నట్లే. ఆ లెక్కలేమిటనేది ఇప్పుడు చూద్దామ్..!
ఇరాన్ నేవీకి చెందిన ప్రధాన ఆయుధాలు ప్రధాన నౌకాదళం వద్దే ఉన్నాయి. ఇందులో భాగంగా... 100కుపైగా యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 18,500 మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో.. జుల్ఫీకర్, షహాండ్, జాగ్రోస్ శ్రేణి డెస్ట్రాయర్లు ఉన్నాయి. ఇవి క్షిపణులు ప్రయోగించడంలో ఉపయోగపడతాయి.
ఈ క్రమంలో ఇరాన్ వద్ద సుమారు పాతిక పైగా సబ్ మెరైన్లు ఉన్నట్లు చెబుతున్నారు. వీటిల్లో మూడు కిలో శ్రేణివి ఉన్నాయి. వీటిని వ్యూహాత్మక ఆపరేషన్లకు వినియోగిస్తారు. మరో కొన్ని ఫతే శ్రేణి జలాంతర్గాములు ఉన్నాయి. ఇదే సమయంలో... వీటితో పాటు ఘదిర్ శ్రేణి మినీ సబ్ మెరైన్లు ఇరాన్ సొంతం. వీటిని స్పెషల్ ఆపరేషన్లు, మెరుపు దాడులకు వాడుతోందని అంటున్నారు.
ఈ క్రమంలో... ఇరాన్ నేవీ 2024లో 2,640 మిసైల్స్, డ్రోన్లను సమకూర్చుకొంది. మరోవైపు రివల్యూషనరీ గార్డ్స్ సంప్రదాయేతర యుద్ధతంత్రం వినియోగిస్తారు. వీరి వద్ద 10 హౌడంగ్ బోట్లు, 25 పీకాప్-2 బోట్లు, 10 వరకు ఎంకే-13 పడవలు ఉన్నాయి.
ఇదే సమయంలో... ఇరాన్ నేవీకి పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సముద్రంలో పలు స్థావరాలున్నాయి. ఇందులో భాగంగా... 'బందర్ అబ్బాస్ బేస్' అనే ఇదే అతిపెద్ద నౌకాదళ స్థావరం ఉంది. ఇక్కడే నేవీ జనరల్ కమాండ్ ఆఫీస్ తో పాటు నౌకలు, సబ్ మెరైన్ల తయారీ కేంద్రం కూడా ఇక్కడే ఉంది.
ఇక గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో జస్క్ బేస్ అనే కీలక స్థావరం ఉంది. ఇరాన్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో ఇదే కీలకం అని చెబుతారు. దీంతో పాటు హిందూ మహాసముద్రంలో మధ్య ఆసియాకు గేట్ వేగా చాబహార్ బేస్ ఉంది. అదేవిధంగా.. ఉత్తర ఇరాన్ లోని చమురు క్షేత్రాల రక్షణలో కీలకంగా ఉండే బందర్-ఈ అంజాలీ బేస్ కూడా ఉంది.
ఇదే క్రమంలో.. పర్షియన్ గల్ఫ్ లో చమురు క్షేత్రాలకు ప్రధాన కేంద్రంగా కహ్ర్గ్ బేస్ ఉంది. ఇక చాబహార్ కు సమీపంలో ఇమామ్ అలీ బేస్ ఉంది. ఇక్కడ నుంచే గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియాలోని నిఘా, ఇతర ఆపరేషన్లు చేస్తారు. వీటితో పాటు ఐ.ఆర్.జీ.సీ.కి అదనంగా హర్మూజ్ జలసంధి వద్ద సిర్క్, అబుముసా బేస్ లు ఉన్నాయి.
ఈ బలంతో, బలగంతో హార్మూజ్ విషయంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఇరాన్ అమలు చేసి, ఈ జలసంధిని మూసేస్తుందా.. లేక, ఈ నిర్ణయాన్ని మార్చుకోమని నయానో భయానో ఒప్పించేందుకు మిగిలిన దేశాల ప్రయత్నాలకు లొంగుతుందా అనేది వేచి చూడాలి!
