భారత్ మిత్రదేశం.. ఇరాన్ రాయబారి మాటల అర్థమేంటి?
తాజాగా జరుగుతున్న ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేయకూడని తప్పును చేసినట్లుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడటం తెలిసిందే.
By: Garuda Media | 14 March 2026 9:41 AM ISTతాజాగా జరుగుతున్న ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేయకూడని తప్పును చేసినట్లుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడటం తెలిసిందే. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి మూడు.. నాలుగురోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన విదేశీ పర్యటనను పలువురు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. మిత్రదేశమైన ఇరాన్ మనసు నొచ్చుకునేలా ప్రధాని మోడీ తీరు ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అలాంటి వాదనల్లో పస లేదన్న విసయాన్ని చెప్పకనే చెప్పేసిన తీరు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ రాయబారి భారత్ తమ మిత్రదేశమన్న విషయాన్ని స్పష్టంగా తేల్చేసిన ఇరాక్ రాయబారి మాటలు మోడీ విమర్శకులకు షాకిచ్చేలా మారాయని చెప్పాలి.
దశాబ్దాల తరబడి భారత్ అనుసరించే విదేశాంగ విధానానికి భిన్నంగా మోడీ తీరు ఉందని.. ఇరుగుపొరుగు దేశాలతో మిత్రత్వానికి బదులుగా చుట్టూ శత్రువులను పెంచుకునేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. తరచూ చోటు చేసుకునే పరిణామాల్ని చూసినప్పుడు మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరు అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ ను పెంచేలా ఉంటున్నాయే తప్ప.. డ్యామేజ్ చేసేలా లేవన్నది మర్చిపోకూడదు. ఇరాన్ తో యుద్ధాన్ని షురూ చేయటానికి ముందు మోడీ ఇజ్రాయెల్ పర్యటన అసలు ఎజెండా ఏమిటన్న దానిపై క్లారిటీ రాకున్నా.. బయటకు రాని ఏదో ఒక కీలక అంశం ఉందన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది.
అయితే.. ఈ పర్యటనతో ఇరాన్ ను నొప్పించేలా ఉందన్న వాదనకు భిన్నంగా యుద్ధ వేళలో భారత్ పట్ల ఆ దేశం స్పందించిన తీరు ఉందన్నది మర్చిపోకూడదు. భారత విన్నపాన్ని రెండో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించటమే కాదు.. భారత చమురు ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న ఇరాన్ తీరు చూస్తే.. ఆ దేశంతో మోడీ సర్కారుకున్న సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పాలి.
హర్మూజ్ జలసంధి మీదుగా భారత జెండాలున్న నౌకల్ని ఇరాన్ అనుమతించిన వైనం తెలిసిందే. దీన్ని మోడీ సర్కారు విజయంగా బీజేపీ అండ్ కో చెప్పుకుంటే.. ఇదంతా మోడీ విదేశాంగ తీరుతోనే సాధ్యమైందని ఆయన భక్తులు నమ్ముతున్నారు. అయితే.. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. భారత విదేశాంగ విధానాన్ని మోడీ మార్చలేదు. కొత్తగా తీసుకురాలేదు. ఆయన అప్పటికే ఉన్న విధానాన్ని ఫాలో అవుతూ.. మరింత మెరుగులు దిద్దే ప్రయత్నం మాత్రమే చేశారన్నది మర్చిపోకూడదు.
ఈ వాదనకు బలం చేకూరేలా భారత్ లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫత్ హలీ స్పందన ఉండటం గమనార్హం. భారత్ తమకు మిత్రదేశమన్న ఆయన.. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పారు. భారత నౌకలు సురక్షితంగా వచ్చేలా చూస్తామని చెప్పటంతో పాటు.. ఇరు దేశాలు ఈ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కలిగి ఉన్నట్లుగా చెప్పారు. ప్రభుత్వం నెలకొన్ని పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తమకు వివిధ అంశాల్లో సాయం చేసినట్లుగా ఆయన వెల్లడించటం గమనార్హం.
హర్మూజ్ జలసంధి ద్వారా కొన్ని దేశాల నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ప్రకటన చేసిన తర్వాత రోజే ఫత్ హలీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా చూస్తే.. భారత్ లోని ఇరాన్ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్యనున్న బలమైన బంధాన్ని స్పష్టం చెప్పినట్లుగా చెప్పాలి. మోడీ ప్రత్యర్థులకు ఈ పరిణామం మింగుడుపడనిదిగా మారుతుందని చెప్పటంలో సందేహం లేదు.
