ఇరాన్ మిత్ర దేశాల లిస్ట్... భారత్ ఉందా ?
గల్ఫ్ యుద్ధంలో కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్ ఈ రోజు అంతర్జాతీయ సమాజంలో అతి పెద్ద చర్చగా మారింది.
By: Satya P | 26 March 2026 10:39 PM ISTగల్ఫ్ యుద్ధంలో కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్ ఈ రోజు అంతర్జాతీయ సమాజంలో అతి పెద్ద చర్చగా మారింది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలసి ఫిబ్రవరి 28న మొదలెట్టిన యుద్ధానికి ఈ నెల 27తో ముప్పయి రోజులు పూర్తి అవుతున్నాయి. ఈ యుద్ధం ముగిసిందా లేక కొనసాగుతుందా అంటే అంతా గందరగోళమే. పెద్దన్నగా ప్రపంచం ముందు కనిపించే అమెరికా గల్ఫ్ యుద్ధం నేపధ్యంలో బాగా అయోమయంలో ఉంది. యుద్ధం స్టార్ట్ చేసిన తరువాత పట్టు దక్కకా చిక్కకా గౌరవనీయమైన ముగింపు కోసం అమెరికా చూస్తోంది అని అంటున్నారు. ఇక ఇజ్రాయెల్ ది అయితే అస్తిత్వ సమస్య అంటోంది. ఇంతదాకా వచ్చిన తరువాత వదలకూడదు అన్నది ఆ దేశం స్ట్రాంగ్ భావన. ఇరాన్ అయితే తోక తొక్కిన తాచు మాదిరిగా ఉంది. తన దేశం జోలికి వచ్చారు, కాబట్టి అంత సులువుగా తాము వదిలిపెట్టమని అంటోంది. దాంతో గల్ఫ్ యుద్ధం ఈ రోజు ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెడుతోంది. ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఇంధన సమస్యలతో పాటు గ్యాస్ సమస్య తలెత్తి దేశాలకు దేశాలే ఆర్థిక సునామీకి గురి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఇరాన్ కీలక డెసిషన్ :
ఈ నేపధ్యంలో ఇరాన్ మీద ప్రపంచ దేశాల ఒత్తిడి అయితే ఉంది. యుద్ధం విరమించుకోవాలని కోరుతున్న వారూ ఉన్నారు. హార్మోజ్ జలసంధి అన్నది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ విషయంలో అంతా కలసి ఇరాన్ మీద సంప్రదింపులు రాయబారాలూ అన్నీ చేస్తున్నారు. అయితే ఇరాన్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూనే మధ్యే మార్గాన్ని ప్రకటించింది. ఆ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది హార్మోజ్ జల సంధి మూసుకుని పోలేదని అది తమ మిత్ర దేశాలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం గా ప్రకటించింది. శత్రు దేశాలకు మాత్రం ఈ జల సంధితో ఇక రుణం తీరినట్లే అంటోంది.
మా ఫ్రెండ్స్ వీరే అంటూ :
ఇరాన్ మిత్ర దేశాల జాబితా చూస్తే రష్యా చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాక్ ఉన్నాయి. ఇండియాను తమ మిత్ర దేశంగానే ఇరాన్ ప్రకటించడం విశేషం. ఇక తమ మిత్రులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హార్మోజ్ జల సంధి ద్వారా నౌకల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఇరాన్ హామీ ఇస్తోంది. ఈ నేపధ్యంలో భారత్ ని కూడా తమ మిత్ర దేశంగా ఇరాన్ పేర్కొనడం అతి పెద్ద ఊరటగా చెప్పాలి.
భారత్ అందరి మిత్రుడు :
ఇదిలా ఉంటే భారత్ మొదటి నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రపంచ వేదిక మీద అందరితోనూ స్నేహంగా ఉంటూ వస్తోంది. గల్ఫ్ యుద్ధం మొదలవడానికి ఇరవై నాలుగు గంటల ముందే ఇజ్రాయెల్ దేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. నిన్ననే అమెరికా భారత్ తో మాట్లాడింది. ట్రంప్ నేరుగా మోడీతో ఫోన్ కలిపారు. రష్యా అయితే భారత్ కి దశాబ్దాల మిత్రుడు. గల్ఫ్ దేశాలన్నింటితో భారత్ కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ విషయంలో ఇప్పటిదాకా భారత్ దౌత్యం మీద పలు అనుమానాలు అంతర్జాతీయ దౌత్య నిపుణులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇపుడు ఇరాన్ మిత్ర దేశంగా భారత్ ని పేర్కొనడంతో ఆ అనుమానాలు పటాపంచలు అయినట్లే అంటున్నారు.
శత్రు దేశాల జాబితా :
ఇక ఇరాన్ శతృ దేశాల జాబితా చూస్తే అందులో మొదటి స్థనం అమెరికాకు దక్కింది. ఆ తరువాత ఇజ్రాయిల్ ని ఉంచింది. ఇక ఈ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయని గల్ఫ్ దేశాలను ఇరాన్ శత్రువుల లిస్టులో ఉంచింది. దాంతో ఈ దేశాల నౌకలను ఎట్టి పరిస్థితుల్లో హార్మోజ్ జల సంధిలోకి అనుమతించమని . ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. ఇక మిత్రులతో తమ బంధం అంతా ఫ్యూచర్ లోనూ కొనసాగుతుందని యుద్ధం ముగిసిన తరువాత కూడా బలంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
నిబంధలను పాటించాలని :
అయితే మిత్ర దేశాల నౌకలు హార్మోజ్ జల సంధి మార్గంలో వెళ్ళాలి అంటే కొన్ని నిబంధలను పాటించాలని ఆయన చెప్పుకొచ్చారు. తమతో పూర్తి కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన అంటున్నారు. అంతే కాదు ఇక మీదట హార్మూజ్ జల సంధిలో ప్రయాణించే నౌకలకు టోల్ వసూలు ఉంటుందని ఇరాన్ చెప్పడమే అతి పెద్ద విశేషంగా అంతా చూస్తున్నారు. దాంతో ఈ యుద్ధం తెచ్చింది సాధించింది ఏంటి అంటో టోల్ బాదుడు అని అంతా అంటున్నారు.
