Begin typing your search above and press return to search.

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత.. భారత నౌకలపై ఇరాన్ బలగాల కాల్పులు

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటిగా పేరుగాంచిన హార్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

By:  A.N.Kumar   |   19 April 2026 12:04 AM IST
హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత.. భారత నౌకలపై ఇరాన్ బలగాల కాల్పులు
X

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటిగా పేరుగాంచిన హార్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్.జీసీ) కాల్పులు జరపడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటన సముద్ర భద్రతపై కొత్త సందేహాలను రేకెత్తించడమే కాకుండా పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగేలా చేస్తోంది.

ఘటన నేపథ్యం.. వివరాలు

అధికారిక నివేదికల ప్రకారం.. భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సమయంలో ఇరాన్ నౌకాదళం వాటిని అడ్డుకుంది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ముడి చమురును భారత్‌కు తరలిస్తోంది. భారీ స్థాయిలో వాణిజ్య సరుకులతో ప్రయాణిస్తోంది.

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ నౌకలు అంతర్జాతీయ సముద్ర సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించాయని.. అందుకే తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరపాల్సి వచ్చిందని ఐఆర్.జీసీ పేర్కొంది. అయితే భారత వర్గాలు ఈ వాదనను పరిశీలిస్తున్నాయి. కాల్పుల అనంతరం నౌకలు తమ ప్రయాణాన్ని నిలిపివేసి వెనక్కి మళ్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ నౌకల్లో ఉన్న సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందడం కొంత ఉపశమనం కలిగించే అంశం.

గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం

హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు 20% కంటే ఎక్కువ వాటా ఈ సన్నని జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. "ఈ మార్గంలో చిన్నపాటి అంతరాయం కలిగినా అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ముఖ్యంగా భారత్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది.

ప్రస్తుత ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. షిప్పింగ్ కంపెనీలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు భీమా ప్రీమియంలను పెంచే ఆలోచనలో ఉన్నాయి.

భారత ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ స్పందన

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించి, ఈ ఘటనపై వివరణ కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. సముద్ర ప్రయాణ స్వేచ్ఛకు విఘాతం కలగడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భారత్ స్పష్టం చేసే అవకాశం ఉంది.

మరోవైపు అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఇప్పటికే నెలకొన్న భద్రతా సంక్షోభం మధ్య భారత నౌకలపై జరిగిన ఈ దాడులు ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచుతాయని భద్రతా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్, ఇరాన్ మధ్య చారిత్రాత్మకంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఇలాంటి ఘర్షణలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. సముద్ర మార్గాల భద్రతను కాపాడుకోవడానికి అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఉద్రిక్తతలు తగ్గించి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే అది గ్లోబల్ ట్రేడ్‌కు కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది.