Begin typing your search above and press return to search.

ఇరాన్ లో భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం.. శాస్త్రవేత్తల మాటిదే!

అవును... ఇజ్రాయెల్‌ దాడులతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌ లో తాజాగా భూకంపం సంభవించింది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:13 PM IST
ఇరాన్  లో భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం.. శాస్త్రవేత్తల  మాటిదే!
X

ఉత్తర ఇరాన్‌ లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.1 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సెమ్నాన్‌ కు నైరుతి దిశలో 27 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే... ఇది నిజంగానే భూకంపం సంభవించిందా.. లేక, టెహ్రాన్ అణ్వాయుధాన్ని పరీక్షించిందా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఇజ్రాయెల్‌ దాడులతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌ లో తాజాగా భూకంపం సంభవించింది. సెమ్నాన్‌ ప్రాంతంలో 5.1 తీవ్రతతో ఇది చోటుచేసుకొంది. అయితే, టెల్‌ అవీవ్‌ తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండవచ్చని, అదే భూకంపానికి కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.

ఈ అనుమానాలు తెరపైకి రావడానికీ బలమైన కారణాలున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్‌ ఉన్న నగరానికి సమీపంలోనే ఈ భూకంపం సంభవించింది. దీంతో.. ఈ ఊహాగానాలకు ఈ విషయం మరింత ఊతమిచ్చింది. దీంతో.. ఈ విషయం అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి... ఇరాన్‌ లోని సెమ్నాన్‌ ప్రావిన్సులోనే అంతరిక్ష కేంద్రం, మిస్సైల్‌ కాంప్లెక్స్‌ లు ఉన్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం చోటుచేసుకుంది. అత్యంత బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్‌ లో అనేక ప్రాంతాలను తాకినట్లు చెబుతున్నారు. అయితే, దీని కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని తెలుస్తోంది.

కాగా... ఇరాన్‌ లో సాధారణంగా సంవత్సరానికి 2,100 భూకంపాలు సంభవిస్తాయి. వాటిలో 15 నుండి 16 వరకు 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఉంటాయి. ఈ క్రమంలో 2006 - 2015 మధ్య, ఆ దేశం సుమారు 96,000 భూకంపాలను చవిచూసింది. దీంతో.. తాజా భూకంపాన్ని వాటితో కలిపేవారే కానీ.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలోనే సందేహాలు వస్తున్నాయి!

అయితే... తాజాగా తెరపైకి వచ్చిన అణు పరీక్షల సందేహాలను భూకంప శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలుళ్లు తీవ్ర ప్రకంపనలకు కారణమవుతుంటాయనేది నిజమే కానీ.. పది కిలోమీటర్ల లోతులో అణుపరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని కొందరు నిపుణులు చెప్పినట్లు ఇరాన్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.