Begin typing your search above and press return to search.

ఒక డాలర్.. 10.43లక్షల రియాల్స్.. ఇరాన్ కరెన్సీ దుస్థితి

అగ్రరాజ్యం అమెరికాతో పంచాయితీ పెట్టుకున్న నాటి నుంచి ఇరాన్ కరెన్సీ మారక విలువ అంతకంతకూ దిగజారుతోంది.

By:  Tupaki Desk   |   6 April 2025 10:00 PM IST
ఒక డాలర్.. 10.43లక్షల రియాల్స్.. ఇరాన్ కరెన్సీ దుస్థితి
X

మీరు చదివింది నిజమే. ఒకే ఒక్క అమెరికా డాలర్ కు ఇరాన్ కరెన్సీ అయిన రియాల్స్ ఎన్ని వస్తున్నాయో తెలుసా? అక్షరాల 10.43 లక్షల రియాల్స్ మారక విలువ పలుకుతోంది. చరిత్రలో అత్యల్ప స్థాయికి ఇరాన్ కరెన్సీ పడిపోయింది. ఇదే పతనం కొనసాగితే రానున్న రోజుల్లో ఇరాన్ కరెన్సీ విలువ మరెంత పడిపోతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా పతనంతో దేశంలో కరెన్సీ మారకానికి కేంద్రంగా నిలిచే టెహ్రాన్ లోని ఫెర్దౌసీ వీధిలో అనేక మంది వ్యాపారులు తమ మారక వ్యాపారాన్ని నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాతో పంచాయితీ పెట్టుకున్న నాటి నుంచి ఇరాన్ కరెన్సీ మారక విలువ అంతకంతకూ దిగజారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణ స్థితిలోఉంది. 2015లో అమెరికాలో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే నాటికి ఒక డాలర్ కు 32 వేల రియాల్స్ ఉండేవి. కొంతకాలంగా కరెన్సీ విలువ అంతకంతకూ పతనమవుతూ వస్తోంది.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇరాన్ రియాల్స్ పతనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మనకు ఉగాది ఎలానో.. పర్షియన్ కొత్త ఏడాది నౌరూజ్ ఇటీవల మొదలైంది. దీంతో.. అక్కడ సెలవులు రావటంతో మారక మార్కెట్లు మూతపడ్డాయి. వీధుల్లో మాత్రం అనధికార దందా నడుస్తోంది. సెలవుల అనంతరం శనివారం పని దినాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రియాల్ కరెన్సీ విలువ మరింత దారుణ స్థితికి చేరుకుందని చెప్పాలి.