Begin typing your search above and press return to search.

డాల‌ర్ కు 12 ల‌క్ష‌లు.. రూపాయికి తాత రియాల్స్.. ఇది ఏ దేశ క‌రెన్సీ?

ఇంకా చెప్పాలంటే.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన పంట కుంకుమ పువ్వు 90 శాతం ఇక్క‌డే పండుతుంది. అలాంటి దేశం ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న ప‌రిస్థితికి చాలా కార‌ణాలున్నాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2025 8:47 AM IST
డాల‌ర్ కు 12 ల‌క్ష‌లు.. రూపాయికి తాత రియాల్స్.. ఇది ఏ దేశ క‌రెన్సీ?
X

అమెరికా డాల‌ర్ తో పోలిస్తే మ‌న రూపాయి మార‌కం విలువ రూ.90కి చేరితేనే అబ్బో అనుకుంటున్నాం.. ఇది ఎక్క‌డికి పోతుంది? అని ఆందోళ‌న చెందుతున్నాం.. పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతాయా? అని బెంగ‌ప‌డుతున్నాం.. కానీ, ఓ దేశ క‌రెన్సీ ఏకంగా డాల‌ర్ తో పోలిస్తే మార‌కం విలువ 12 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇంత దారుణంగా ప‌త‌నం ఇటీవ‌లి కాలంలో ఏ దేశ క‌రెన్సీకి లేద‌ని చెప్పొచ్చు. అయితే, అదేమీ సాధార‌ణ దేశం కాదు.. చిన్నది కాదు..! ఎంతో చ‌రిత్ర ఉన్న‌ది. అంత‌కుమించి రాజ‌కీయంగా కీల‌క దేశం. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన పంట కుంకుమ పువ్వు 90 శాతం ఇక్క‌డే పండుతుంది. అలాంటి దేశం ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న ప‌రిస్థితికి చాలా కార‌ణాలున్నాయి.

ట్రంప్ కొట్టిన దెబ్బ‌

ప‌శ్చిమాసియాలో అత్యంత కీల‌క‌మైన ఇరాన్ క‌రెన్సీ ఏడాది నుంచి దారుణంగా ప‌త‌నం అవుతోంది. అప్ప‌ట్లోనే ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయినా ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మ‌రింత అధ్వాన స్థితికి చేరింది. అటు ఇరాన్ అధ్య‌క్షుడు ఏడాదిన్న‌ర కింద‌ట హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌వ‌గా, ఇటు ఇజ్రాయెల్ తో ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. మ‌రోవైపు అణుశుద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ అమెరికా నుంచి ఆంక్ష‌ల‌ను ఎదుర్కొంది. అమెరికాకు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో అధ్య‌క్షుడు అయిన వెంట‌నే డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా తీయ‌డంతో ఇరాన్ ప‌రిస్థితి మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన చందంగా మారింది. తాజాగా డాల‌ర్ విలువ‌తో పోలిస్తే ఇరాన్ క‌రెన్సీ రియాల్స్ 12 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. ముఖ్యంగా అణు ఆంక్ష‌ల ప్ర‌భావం ఈ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్రంగా ప‌డింది.

రోజువారీ జీవితం అత‌లాకుతలం

నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌డంతో ఇరాన్ ప్ర‌జ‌ల రోజువారీ జీవితం అత‌లాకుతలం అవుతోంది. ఇరాన్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ముడి చ‌మురు. అయితే, ఆ దేశంతో చ‌మురు వ్యాపారం చేయ‌కుండా ట్రంప్ ఆంక్ష‌లు విధించారు. మూడు నెల‌ల కింద‌ట ఇరాన్ పై అణు ఆంక్ష‌ల‌ను అమెరికా మ‌ళ్లీ అమ‌ల్లోకి తెచ్చింది. విదేశాల్లోని ఆ దేశ ఆస్తులు స్తంభించాయి.

ప్ర‌భుత్వం విఫ‌లం..

ఇరాన్ కు అటు అమెరికాతో ఇటు ఇజ్రాయెల్ తో నిత్యం వైర‌మే. హ‌మాస్ కు మ‌ద్ద‌తుగా ఇజ్రాయెల్ పై దాడికి దిగింది కూడా. అయితే, అవినీతి, అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంతో ఇరాన్ లో పాల‌న గాడిత‌ప్పింది. ప‌వ‌ర్ గ్రిడ్ లు త‌ర‌చూ విఫ‌లం అవుతూ దేశంలో అంధ‌కారం అల‌ముకుంటోంది. ఇక చ‌లికాలం రావ‌డంతో ఉష్ణోగ్ర‌త‌లు బాగా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. దీంతో ఇంధ‌న సంక్షోభం ఏర్ప‌డుతోంది. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశం అయిన ఇరాన్ కు ఈ ప‌రిస్థితి ఊహించ‌నిదే.