ఏది దొరికితే దాంట్లో వెళ్లిపోండి..ఇరాన్ లోని భారతీయులకు హెచ్చరిక
పశ్చిమాసియా దేశం ఇరాన్ లో పరిస్థితులు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలను చేస్తున్నారు.
By: Tupaki Desk | 15 Jan 2026 12:55 AM ISTపశ్చిమాసియా దేశం ఇరాన్ లో పరిస్థితులు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలను చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోందనే కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే 2,500 మందిపైగా ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ లో ఇంకా ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు అని వివిధ దేశాల ప్రభుత్వాలు తమ తమ ప్రజలకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. సహజంగా ఏదైనా దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటే పౌరులను అప్రమత్తం చేసేందుకు ఈ హెచ్చరికలు చేస్తుంటారు. అప్పటికే ఉన్నవారిని వెనక్కు వచ్చేయాలని, ప్రయాణాలు పెట్టుకున్న వారు అత్యవసరం అయితే తప్ప వెళ్లొద్దని అలర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో భారత ప్రభుత్వం మన దేశీయులకు ఇదే హెచ్చరికలు పంపింది.
ఎంతకూ తగ్గని ఆందోళనలు..
ఇరాన్ లో డిసెంబరు చివరి వారంలో మొదలైన ఆందోళనలు ఎంతకూ తగ్గడం లేదు. సరికదా.. అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. మరోవైపు ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడిచేస్తుందని కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు వార్నింగ్ లు ఇస్తున్నారు. దీంతో ఇరాన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించింది. ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లొద్దని భారతీయులను అలర్ట్ చేసింది. రాయబార కార్యాలయాలతో టచ్ లో ఉండాలని సూచించింది. పాస్ పోర్టులు, గుర్తింపు కార్డులు, ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలు దగ్గర పెట్టుకోవాలని పేర్కొంది. ఎంబసీలో ఇప్పటికీ రిజిష్టర్ కాకుంటే వెంటనే చేసుకోవాలని ఆదేశించింది. ఏది దొరికితే దాంట్లో ప్రయాణించి ఇరాన్ ను వీడాలని హెచ్చరించింది. ఇటువైపు.. తదుపరి నోటీసు ఇచ్చేదాక ఇరాన్ కు వెళ్లొద్దంటూ భారత విదేశాంగ శాఖ భారతీయులకు సూచించింది.
ఇరాన్ లో భారతీయులు ఎందరు?
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇరాన్ లో భారతీయుల సంఖ్య 10 వేల నుంచి 12 వేల వరకు ఉంటుంది. వీరిలో పదివేల మంది ఎన్ఆర్ఐలే. 3 వేల మంది వరకు విద్యార్థులు ఎక్కువగా మెడిసిన్ చదువుతున్న వారు ఉండొచ్చు. వీరు కూడా కశ్మీర్ కు చెందినవారే. మిగతావారంతా కార్మికులు.
