అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. యుద్ధ విమానాన్ని కూల్చిన ఇరాన్?
ఇప్పుడు అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఇరాక్ లో యూఎస్ మిలిటరీ కేసీ135 యుద్ధ విమానం కూలిపోయిన వైనం సంచలనంగా మారింది.
By: Garuda Media | 13 March 2026 10:51 AM ISTఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో మరో సంచలనం చోటు చేసుకుంది. యుద్ధంలో తమ అధిక్యతను ఇజ్రాయెల్ - అమెరికాలు పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తున్నా.. ఇరాన్ ఎంతకు తగ్గకపోవటం.. ఊహించనిరీతిలో అది చేస్తున్నయుద్ధం గెరిల్లాను తలపించేలామారింది. ఇజ్రాయెల్ - అమెరికాలను నిలువరించే విషయంలో ఒక్క సందర్భంలో లేకున్నా.. ఆ రెండు దేశాలకు మాత్రం కాలిలో ముల్లులా మారింది.అప్పుడప్పుడు అది చేసే చర్యలతో కంట్లో నలుసులా మారిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఇరాక్ లో యూఎస్ మిలిటరీ కేసీ135 యుద్ధ విమానం కూలిపోయిన వైనం సంచలనంగా మారింది.
ఈ మిలిటరీ విమానాన్ని తామే కూల్చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అయితే.. సాంకేతిక లోపంలోనే కూలినట్లుగా అమెరికా చెబుతోంది. ఈ విమానం యుద్ధ విమనాలకు ఇంధనం నింపే విమానం. పశ్చిమ ఇరాక్ లోని ఈ విమానం కూలిపోయింది. ఈ ఉదంతంలో ఇరాన్ మద్దతు ఉన్న రెసిస్టెన్స్ గ్రూపులు ఈ విమానాన్ని క్షిపణితో పేల్చేశామని.. అందులో అరుగురు సిబ్బంది మరణించినట్లుగాఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అయితే.. దీనికి భిన్నంగా అమెరికా వాదన ఉంది.
అమెరికా సెంట్రల్ కమాండ్ విమానాన్ని కోల్పోయినట్లుగా వెల్లడించింది. అయితే.. ఇది శత్రువుల దాడితో కాకుండా సాంకేతిక కారణాలతో జరిగినట్లుగా వెల్లడించింది. ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పటికే అమెరికా మూడు ఎఫ్ 15ఈ యుద్ధ విమానాల్ని కోల్పోయింది. అయితే.. అవన్నీ కువైట్ ఫ్రెండ్లీ ఫైర్ తో కూలినట్లు అమెరికా అప్పట్లో చెప్పింది. అయితే.. ఇదంతా తమ పనే అని ఇరాన్ పేర్కొంది. ఈ ఉదంతం భారత కాలమానం ప్రకారం శుక్రవారం (మార్చి 13) తెల్లవారుజామున 3.30 గంటలనుంచి 4 గంటల మధ్య వెలుగు చూసింది.
తమ యుద్ధ విమానం శత్రువుల దాడితో కూలిపోలేదని అమెరికా స్పష్టం చేసింది. రెండు విమానాల మధ్య జరిగిన సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంది. ఈ ఉదంతంలో రెండు విమానాలు ఉన్నాయని.. ఒకటి కూలిపోగా.. రెండోది సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా పేర్కొంది. కూలిన విమానంలోని సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా నాలుగు యుద్ధ విమానాల్ని కోల్పోయింది.
తాజాగా కూలిన కేసీ 135 స్ట్రాటో ట్యాంకర్ విమానం విలువ సుమారు రూ.330 కోట్ల నుంచి 415 కోట్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు గతంలో మూడు ఎఫ్15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాల్ని కోల్పోయింది. గగనతలం నుంచి దాడులు చేయటం.. భూమిపై లక్ష్యాల్ని ఛేదించటంలో దీనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మూడు యుద్ధ విమానాల విలువ దగ్గర దగ్గర రూ.1250 కోట్లుగా చెబుతున్నారు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఇప్పుడు చెబుతుున్న నష్టం కేవలం విమానాల తయారీకి అయ్యేది మాత్రమే. దీంతో పాటు.. అందులో ఉండే అత్యాధునిక ఆయుధాలు.. సెన్సార్లు.. శిక్షణ పొందిన సిబ్బంది విలువను లెక్కిస్తే.. నష్టం మరింత భారీగా ఉంటుందని మర్చిపోకూడదు. యుద్ధం ఎప్పుడూ నష్టాన్ని మాత్రమే చేస్తుంది. లాభం జరుగుతుందన్నది ఉత్త భ్రమ మాత్రమే.
